హైదరాబాద్: నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. జీతాలు చెల్లించడంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. నాలుగు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గతంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేసినా సమస్య పరిష్కారం కాలేదని కార్మిక సంఘం నాయకులు తెలిపారు.
ఈ నెల 19లోగా జీతాలు చెల్లిస్తామని కాంట్రాక్టర్లు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.లేకపోతే సమ్మెను కొనసాగించడంతో పాటు కార్మిక శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు.
