మనం కష్టపడి సంపాదించే జీతంలో పీఎఫ్ కట్ అవుతుంటే.. అబ్బా శాలరీ తగ్గిపోతుందని చాలామంది ఫీలవుతుంటారు. ఆ పీఎఫ్ అకౌంట్ వెనుక ఫ్యామిలీకి కొండంత అండగా నిలిచే ఒక అదిరిపోయే ఉచిత ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అవును అదే 'EDLI' (ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్) స్కీమ్. దీని ద్వారా ఒక ఉద్యోగి సర్వీసులో ఉండగా చనిపోతే.. వారి కుటుంబానికి రూ.7 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ సొమ్ము లభిస్తుంది.
అయితే ఈ డబ్బులు మీ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో అందాలంటే ఒక చిన్న పని వెంటనే చేయాలని ఈపీఎఫ్ఓ తాజాగా హెచ్చరించింది. అదే.. మీ పీఎఫ్ అకౌంట్‌కు 'ఈ-నామినేషన్' అప్‌డేట్ చేయటం.
ఈ EDLI స్కీమ్ అనేది ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కల్పించిన ఒక అద్భుతమైన సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్. దీని కోసం ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్రీమియం మొత్తాన్ని కంపెనీ యజమానులే భరిస్తారు. పీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఉద్యోగికి ఇది ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. దీని కింద కనీస ఇన్సూరెన్స్ మొత్తం రూ.రెండున్నర్ల లక్షల నుంచి గరిష్టంగా రూ.7 లక్షల వరకు లభిస్తుంది. పైగా ఈ డబ్బుపై ఎలాంటి పన్నులు కట్టక్కర్లేదు.. పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ.
ఈ-నామినేషన్ ఎందుకు ముఖ్యం?
ఒకవేళ ఉద్యోగికి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే.. ఆ కష్ట కాలంలో వారి కుటుంబ సభ్యులు ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకూడదని ఈపీఎఫ్ఓ ఈ ఆన్‌లైన్ నామినేషన్ సౌకర్యాన్ని తెచ్చింది. ఒకవేళ నామినీ వివరాలు అప్‌డేట్ చేయకపోతే, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి తిరగాల్సి వస్తుంది. అదే ఈ-నామినేషన్ ఉంటే.. కేవలం 30 రోజుల్లోనే క్లెయిమ్ సెటిల్ అయిపోతుంది. ఒకవేళ 30 రోజులు దాటితే ఈపీఎఫ్ఓ ఏకంగా 12% వడ్డీతో కలిపి ఆ సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది.
ALSO READ : గ్రీన్‌కార్డ్ కోసం ఇండియా వచ్చే NRIలకు కొత్త కష్టాలు.
ఒకేసారి మూడు లాభాలు..
ఉద్యోగి మరణించిన తర్వాత నామినీకి కేవలం ఇన్సూరెన్స్ డబ్బులే కాదు.. పీఎఫ్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ వడ్డీతో సహా అందుతుంది. దాంతో పాటు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా జీవిత భాగస్వామికి ప్రతి నెలా పెన్షన్ కూడా వస్తుంది. పిల్లలు ఉంటే వారికి కూడా దీని నుంచి ప్రయోజనం ఉంటుంది.
పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం లాంటి జీవితంలో వచ్చే మార్పులను బట్టి నామినీ వివరాలను ఎప్పటికప్పుడు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఇప్పుడే మీ UAN పోర్టల్‌లోకి లాగిన్ అయి నామినీని యాడ్ చేసుకోండి. ఫ్యామిలీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వండి ఒక్క రూపాయి కూడా అదనపు ఖర్చు లేకుండానే.
