ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మూడో ఆదివారం నాన్నల కోసమే ప్రత్యేకించబడింది. ఈ ఏడాది జూన్ 21న ఫాదర్స్ డే రాబోతోంది. మనల్ని వేలు పట్టి నడిపించి, కంటికి రెప్పలా కాపాడుతూ, మన ఎదుగుదల కోసం అహర్నిశలు శ్రమించే 'నాన్న'కు థాంక్స్ చెప్పుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. బిజీ లైఫ్‌ను కాస్త పక్కన పెట్టి, ఆయనపై మనకున్న ప్రేమనంతా చూపించడానికి ఈ రోజును ఒక వేడుకలా జరుపుకోవచ్చు.
అసలు 'ఫాదర్స్ డే' ఎప్పుడు, ఎలా మొదలైంది?
మదర్స్ డే లాగే తండ్రులను కూడా గౌరవించాలనే ఉద్దేశంతో 1900ల ప్రారంభంలో ఈ ఫాదర్స్ డే ఆలోచన పుట్టింది. అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆమె తండ్రి ఒక ఆర్మీ సైనికుడు. భార్య చనిపోయిన తర్వాత ఆయన ఒక్కడే ఆరుగురు పిల్లలను ఎంతో ప్రేమగా, బాధ్యతగా పెంచి పెద్ద చేశారు. తన తండ్రి చేసిన త్యాగానికి గుర్తుగా ఆమె ప్రారంభించిన ఈ ప్రయత్నమే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డేగా మారింది.
నాన్నతో ఈ రోజును స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని ఐడియాలు:
కలిసి కాసేపు : పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు... నాన్నతో కలిసి కాఫీ తాగుతూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, లేదా రాత్రికి అందరూ కలిసి డిన్నర్‌కు వెళ్లడం చేయండి. మీరిద్దరూ ఆ క్షణాలను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకోండి.
ఇష్టమైన గిఫ్ట్ : నాన్న చాలా రోజులుగా కొనాలనుకుంటున్న వస్తువును సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇవ్వండి. ఒక మంచి బ్రాండెడ్ వాలెట్, స్మార్ట్ వాచ్, లేదా సరికొత్త హెడ్‌ఫోన్స్ లాంటివి ప్లాన్ చేయొచ్చు లేదా ఆయన ఫోటో ఉన్న కాఫీ మగ్, టీషర్ట్ లాంటి పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ కూడా ఇవ్వొచ్చు.
స్పెషల్ గ్రీటింగ్ కార్డ్ లేదా ఆర్ట్ వర్క్: మార్కెట్లో కొనే వాటికంటే మీ చేతులతో సొంతంగా ఒక కార్డ్ తయారు చేసి, దానిపై నాన్న గురించి మీకున్న ప్రేమను రాసి ఇవ్వండి. ఆ చిన్న కార్డు ఆయన గుండెకు హత్తుకుంటుంది.
ALSO READ : కుటుంబ బాధ్యతలు మోసే నాన్న కోసం ఒక రోజు
నాన్న కోసం వంట : కిచెన్‌లో నాన్నకు ఇష్టమైన వంటకాన్ని మీరే స్వయంగా వండి వడ్డించండి. ఆయనకు నచ్చిన డ్రింక్‌ను కూడా జత చేస్తే, ఆ లంచ్ లేదా డిన్నర్ నాన్నకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది.
