టాలీవుడ్‌లో యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించిన ఈ యంగ్ హీరో.. తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యాడు. డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ వివాహ వేడుక జరగనుంది. లేటెస్ట్ గా ఈ విషయాన్ని స్వయంగా తేజ వెల్లడించారు. తనది పెళ్లి ప్రేమ వివాహం కాదని, పెద్దలు కుదిర్చిన సంబంధమని స్పష్టం చేశాడు.
ఉదయ్‌పూర్‌లో పెళ్లి..
తేజ సజ్జా పెళ్లి వేడుకలు నవంబర్‌లో నిశ్చితార్థంతో ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత డిసెంబర్‌లో ఉదయ్‌పూర్‌లో వివాహ వేడుక జరగనుంది. రాజభవనాలు, సరస్సులు, అద్భుతమైన ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ఉదయ్‌పూర్‌లో ఈ వేడుక నిర్వహించనుండటం ఆసక్తికరంగా మారింది. అయితే భారీ హంగామాతో సెలబ్రిటీ వెడ్డింగ్ నిర్వహించాలనే ఆలోచన తనకు లేదని తేజ స్పష్టం చేశాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. మా తల్లిదండ్రులే సంబంధం ఖాయం చేశారు అని తేజ వెల్లడించాడు.
కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
తేజ జీవితంలోకి అడుగుపెట్టబోతున్న అమ్మాయికి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదట. ఆమె కుటుంబం టెక్నాలజీ రంగంలో ఉంది. తన తండ్రితో కలిసి ఆమె కూడా అదే వ్యాపారంలో పనిచేస్తున్నట్లు తేజ తెలిపాడు. అమెరికాలో పెరిగిన ఆమెకు సినిమా ప్రపంచంలోని హడావుడి, సెలబ్రిటీ లైఫ్‌స్టైల్ గురించి పెద్దగా పరిచయం లేదని చెప్పుకొచ్చాడు. ఆమెకు ఈ లైమ్‌లైట్ గురించి తెలియదు. అదే నాకు బాగా నచ్చింది. పెళ్లి తర్వాత కూడా ఆమె వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలనుకుంటున్నా అని తేజ చెప్పుకొచ్చారు.
ALSO READ : కరెంట్ పోతే సెల్ఫీ తీసి పంపండి.. 'జైలర్ 2' టికెట్ పట్టేయండి..
హైదరాబాద్‌లో రిసెప్షన్..
'హనుమాన్', 'మిరాయ్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించిన తేజ.. తన పెళ్లిని మాత్రం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యే జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉదయ్‌పూర్‌లో వివాహం పూర్తయ్యాక హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్‌గా ఉంచే తేజ.. ఈ విషయంలోనూ అదే పంథాను కొనసాగించనున్నాడు. స్క్రీన్‌పై సూపర్‌హీరోగా అలరించే తేజ.. నిజ జీవితంలో కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ ఈ యంగ్ హీరోకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
