Jailer 2 Tickets Free : కరెంట్ పోతే సెల్ఫీ తీసి పంపండి.. 'జైలర్ 2' టికెట్ పట్టేయండి.. తమిళనాడులో 'పవర్' పాలిటిక్స్!

Jailer 2 Tickets Free : కరెంట్ పోతే సెల్ఫీ తీసి పంపండి.. 'జైలర్ 2' టికెట్ పట్టేయండి.. తమిళనాడులో 'పవర్' పాలిటిక్స్!

సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలకు ఉండే క్రేజే వేరు.. ఆయన సినిమా విడుదలైతే థియేటర్ల దగ్గర అభిమానుల సందడి మామూలుగా ఉండదు. లేటెస్ట్ గా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్ 2' అక్టోబర్ 15న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 582 కోట్లకు పై వసూళ్లు రాబట్టింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రజనీకాంత్‌తో పాటు రమ్యకృష్ణన్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విద్యా బాలన్ తదితరులు నటించారు.

కరెంట్ కట్‌కు సెల్ఫీతో చెక్ ..

అయితే 'జైలర్ 2' చిత్రంపై మరో ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట తెగ చక్కళ్లు కొడుతోంది. కరెంట్ పోతే చాలు.. వెంటనే ఓ సెల్ఫీ తీసి పంపండి.. ఏకంగా రజనీకాంత్ సినిమా టికెట్ ఉచితంగా పొందండి అంటూ తమిళనాడులో అన్నాడీఎంకే (AIADMK) వార్డు నంబర్ 9 కౌన్సిలర్ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. తిరుప్పూర్‌లో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎదురవుతున్నాయంటూ స్థానికంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నిరసన రూపంలో ఇలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.

తమ ప్రాంతంలో కరెంట్ పోయినప్పుడు ఇంట్లోనే సెల్ఫీ తీసి వాట్సాప్ ద్వారా పంపించాలని ఆయన నివాసితులకు సూచించారు. ఇలా విద్యుత్ కోతలను నమోదు చేసి పంపిన వారికి 'జైలర్ 2' సినిమా టికెట్లు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ ఆఫర్‌కు స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. విద్యుత్ కోతల సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, సూపర్‌స్టార్ సినిమాను ఉచితంగా చూసే అవకాశం రావడంతో పలువురు తమ ఫొటోలను పంపినట్లు సమాచారం.

ALSO READ : టైగర్ ష్రాఫ్పై కాల్పుల కేసు: బుల్లెట్ తీసేందుకు రెండు రోజులు ఎందుకు పట్టింది..?

ఉచితంగా సినిమా టికెట్లు..

ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత వార్డులోని 55 మంది ఎంపిక చేశారు. ఒక్కొక్కరు తమ కుటుంబ సభ్యుల్లో మరొకరిని వెంట తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించడంతో వారి సంఖ్య 110కి చేరింది. మరో 15 మంది అన్నాడీఎంకే కార్యకర్తలను కూడా చేర్చడంతో మొత్తం 125 మంది ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగమయ్యారు. వీరందరినీ తిరుప్పూర్‌లోని అంగేరిపాళయం ప్రాంతంలో ఉన్న థియేటర్‌కు తీసుకెళ్లి 'జైలర్ 2' సినిమా చూపించారు.