బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై జరిగిన దాడి దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ ఘటనలో శరీరంలోకి చొచ్చుకు పోయిన బుల్లెట్ తీసేందుకు డాక్టర్లు రెండు రోజులు ఆగారు. బుల్లెట్ తీసేందుకు రెండు రోజులు ఎందుకు పట్టింది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
టైగర్ ష్రాఫ్ నివాసం సమీపంలో కాల్పుల్లో గాయపడిన వ్లాగర్ ఉమేష్ చౌహాన్‌కు శరీరంలో ఉన్న 1.5 సెం.మీ. బుల్లెట్‌ను తీసేందుకు కేఈఎం ఆసుపత్రి వైద్యులు రెండు రోజులు వేచి చూశారు. అయితే ఇంటర్నల్ గా బ్లీడింగ్ (రక్తస్రావం), కీలక అవయవాలకు నష్టం జరిగిందో లేదో పరిశీలించిన తర్వాతే ఆపరేషన్ చేశారు.
అక్టోబర్ 18న జుహూలోని పుష్ప పార్క్ దగ్గర, నటుడు టైగర్ ష్రాఫ్ ఇంటి బయట వీడియో తీస్తున్నప్పుడు మంఖుర్ద్కు చెందిన వ్లాగర్ ఉమేష్ చౌహాన్‌పై కాల్పులు జరిగాయి. బుల్లెట్ ఛాతీ ప్రాంతం గుండా వెళ్లి కాలేయం (లివర్) సమీపంలో గాయం చేసి శరీరంలోనే చిక్కుకుంది. ఉమేష్ లోపల అత్యవసర రక్తస్రావం లేనందున వైద్యులు పరిశీలన చేసిన తర్వాతే మంగళవారం (అక్టోబర్ 20) ఆపరేషన్ చేశారు. ఈ సర్జరీకి సుమారు రెండు గంటలు పట్టింది.
కేఈఎం ఆసుపత్రి కార్డియాక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ ఉదయ్ జాధవ్ చెప్పిన ప్రకారం, గన్‌షాట్ గాయం తర్వాత మొదటి ప్రాధాన్యత రోగిని స్థిరంగా ఉంచడం. అంతర్గత నష్టం ఎంత ఉందో తెలుసుకోవడం. అత్యవసర ఆపరేషన్ అవసరమా అని నిర్ణయించుకోవడమే ముఖ్యం.
బుల్లెట్‌ను వెంటనే ఎందుకు తీయరు?
గన్‌షాట్ గాయం తర్వాత తక్షణ ప్రమాదం బుల్లెట్ కాదు, అది కలిగించిన నష్టమే. వైద్యులు మొదట పెద్ద రక్తనాళాలు, హృదయం, ఊపిరితిత్తులు, కాలేయం, ప్రేగులు వంటి కీలక అవయవాలకు గాయం జరిగిందో లేదో పరిశీలిస్తారు. ఆపలేనంతగా బ్లీడిండ్ జరిగితే లేదా కీలక అవయవాలకు నష్టం ఉంటే అత్యవసర ఆపరేషన్ చేస్తారు. అప్పుడు బ్లీడింగ్ ఆపడం, గాయానికి మరమ్మతు చేయడమే డాక్టర్ల ప్రాధాన్యత. రోగి స్థిరంగా ఉండి బుల్లెట్ తక్షణ ప్రమాదం కలిగించకపోతే పూర్తిగా పరిశీలన చేసి తర్వాత తీస్తారు. బుల్లెట్ ఉన్న స్థానం, తీస్తే మరిన్ని నష్టాలు కలుగుతాయా అనేది కూడా నిర్ణయించాల్సి వస్తుంది.
చిన్న బుల్లెట్ ఎలా పెద్ద నష్టం చేస్తుంది?
బుల్లెట్ చిన్నదా పెద్దదా అనేది గాయం తీవ్రతను నిర్ణయించదు. దాని వేగం, ఎక్కడ తగిలింది, అవయవాల నిర్మాణం, తాకిన కణజాలం ఇవన్నీ ప్రభావం చూపుతాయి. బుల్లెట్ వెళ్లే మార్గంలోని కణజాలాన్ని దెబ్బతీయడంతో పాటు, చుట్టుపక్కల కణజాలాలను డ్యామేజ్ చేసి వాటిని సాగదీసి చిరిగిపోయేలా చేస్తుంది. దీన్ని టెంపరరీ కావిటేషన్ అంటారు. ఇది బుల్లెట్ వెళ్లే మార్గం కంటే ఎక్కువ ఇతర ప్రాంతానికి నష్టం కలిగిస్తుంది. పెద్ద రక్తనాళానికి గాయం అయితే ప్రాణాంతక రక్తస్రావం, ఊపిరితిత్తులకు గాయం అయితే శ్వాసకోశ సమస్యలు, కడుపులో అవయవాలకు గాయం అయితే అంతర్గత రక్తస్రావం కలుగుతాయి. ఉమేష్ విషయంలో బుల్లెట్ ఉన్న స్థానం వల్ల చిన్న కోతతోనే తీయగలిగారు.
ALSO READ : రణ్‌బీర్‌కు అలియా భట్ సైలెంట్ సపోర్ట్?
శరీరంలో బుల్లెట్ ఉంచడం సురక్షితమేనా?
బుల్లెట్ ను శరీరంలోనే ఉంచడం అన్ని వేళలా సురక్షితం కాదు. ఉన్న స్థానాన్ని బట్టి చుట్టుపక్కల నిర్మాణాలకు నష్టం కలగవచ్చు. కానీ తీయడం కూడా ప్రమాదకరం. ముఖ్యంగా కీలక అవయవాలు, నరాలు లేదా పెద్ద రక్తనాళాల దగ్గర ఉంటే ప్రమాదం ఎంత మేరకు ఉంటుంది.. అని పోల్చి చూసిన తర్వాత వెంటనే ఆపరేషన్ చేయాలా, ఆలస్యంగా తీసినా పర్లేదా అనే పరిశీలిస్తారు.
బుల్లెట్లు కాల్చినప్పుడు వచ్చే వేడి వల్ల దానిపై సూక్ష్మజీవులు చనిపోయి ఉంటాయి.. బుల్లెట్ దిగిన చోట సూక్ష్మజీవులతో నష్టం ఉండదు అనుకోవడానికి లేదు. వేడి అనేది సూక్ష్మజీవులను పూర్తిగా చంపదు. గుండు, తుపాకీ, చర్మం లేదా దుస్తుల నుంచి కలుషిత పదార్థాలు, సూక్ష్మజీవులు గాయంలోకి ప్రవేశించవచ్చు. అయితే ఉమేష్ స్థిరంగా ఉన్నందున, అత్యవసర రక్తస్రావం లేనందున వైద్యులు బుల్లెట్ ఆలస్యంగా తీశారు.
