కొడుకు కోసం కొత్త వంటకాలు నేర్చుకుంది. సరదాగా వాటి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందరూ వాటి గురించి ఆరా తీశారు. దాంతో ఆ రెసిపీలతోనే ఫుడ్ బ్లాగింగ్ చేసింది ఉమా రఘురామన్. ఆ తర్వాత యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అనుకోకుండానే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిపోయింది. అంతేకాదు.. వంటల పుస్తకం రాసి రచయితగానూ సక్సెస్ అయ్యింది. పిల్లల టిఫిన్‌ల నుంచి పండుగ వంటల వరకు ఎన్నో కొత్త రెసిపీలను అందించి ఫుడ్ లవర్స్‌కు దగ్గరైంది.
ఉమ తమిళనాడులో పుట్టింది. అన్నామలై యూనివర్సిటీలో చదువుకుంది. ఆ తర్వాత రఘురామన్‌ను పెండ్లి చేసుకుంది. ఉమకు వంటపై పెద్దగా అవగాహన లేదు. కానీ.. భర్త రఘురామన్ ఫుడ్ లవర్ కావడంతో అతని కోసం తల్లి, అత్త సాయంతో సంప్రదాయ వంటకాల్లో బేసిక్స్ నేర్చుకుంది. కొడుకు విష్ణుకు చిన్నప్పుడు పోషకాలుండే ఫుడ్ పెట్టాలి అనుకునేది. అతను మాత్రం ఫుడ్ తినడానికి మారాం చేసేవాడు.
దాంతో హెల్దీ ఫుడ్‌ని కూడా ఆకర్షణీయంగా, రుచిగా ఎలా వండాలో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. అలా ఆమెకు వంటపై ఇష్టం పెరిగింది. ఆ తర్వాత వాళ్ల కుటుంబం ఢిల్లీకి మారింది. ఆమె జీవితంలో అదే పెద్ద మలుపు. కొత్త సంస్కృతి, భాషతోపాటు కొత్త వంటకాలు నేర్చుకుంది. రెండో కొడుకు పుట్టాక స్నేహితుల నుంచి బేకింగ్, మలబార్ పరోటా, స్టఫ్డ్ కుల్చాలు లాంటివి చేయడం తెలుసుకుంది. ఆ తర్వాత పిల్లల కోసం ఎన్నో ఇన్నొవేటివ్ లంచ్‌బాక్స్ రెసిపీలు చేసింది.
బ్లాగింగ్, యూట్యూబ్ జర్నీ
ఉమ తాను ప్రతిరోజూ వండే వంటల ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేది. వాటికి స్నేహితులు, బంధువుల నుంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చేవి. ఆ రెసిపీల గురించి చాలామంది అడిగేవాళ్లు. అందరికీ విడివిడిగా చెప్పడం కష్టమయ్యేది. దాంతో 2014 లో ‘మాస్టర్ చెఫ్ మామ్’ పేరుతోనే బ్లాగ్ ప్రారంభించింది. అందులో రెగ్యులర్‌గా తను చేసే వంటల రెసిపీల గురించి రాసేది. అలా ఇప్పుడు ఆ బ్లాగ్‌లో వంటకాల సంఖ్య 1,100కి చేరింది. బ్లాగ్ సక్సెస్ కావడంతో మరుసటి సంవత్సరమే తన వంటల తయారీ విధానాన్ని మరింత సులభంగా వివరించడానికి ‘మాస్టర్ చెఫ్ మామ్’ పేరుతోనే యూట్యూబ్ చానెల్ పెట్టింది.
►ALSO READ | Sharafudheen: ఐటీ జాబ్ వదిలి సినిమాల్లోకి: ఆ ఒక్క నిర్ణయం.. ఈ హీరో లైఫ్నే మార్చేసింది
వంటకాలు.. చిట్కాలు
యూట్యూబ్ చానెల్‌లో సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ వంటకాలు, హెల్తీ ఫ్యూజన్ ఫుడ్స్, లంచ్‌బాక్స్ రెసిపీలతోపాటు ఎన్నో వంటింటి చిట్కాల వీడియోలు అప్‌లోడ్ చేసింది. కాకపోతే.. యూట్యూబ్‌లో అనుకున్నంతంగా సక్సెస్ రాలేదు. ప్రస్తుతం చానెల్‌కు 4.32 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఇప్పటివరకు చానెల్‌లో 631 వీడియోలు అప్‌లోడ్ చేసింది. కొన్ని షార్ట్ వీడియోలకు మాత్రం వ్యూస్ బాగానే వచ్చాయి. అయితే.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఉమ చాలా తక్కువ టైంలోనే సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా పేజీని దాదాపు 13 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అందులో కూడా రెగ్యులర్‌గా వీడియోలు పోస్ట్ చేస్తోంది.
అన్నీ నేర్చుకుంది
మొదట్లో ఉమ స్కూల్ టీచర్‌గా పనిచేసింది. దాంతో డిజిటల్ మీడియా, బ్లాగింగ్, వెబ్‌సైట్ మెయింటెయిన్, సోషల్ మీడియా ఆపరేషన్స్ లాంటి సాంకేతిక విషయాలు తెలుసుకునేందుకు సరిగ్గా టైం దొరికేది కాదు. అయినా కష్టపడి నేర్చుకుంది. అంతేకాదు.. బ్లాగ్స్ మొదలుపెట్టినప్పుడు వంటకాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో బాగా చూపించేందుకు స్టూడియో -క్వాలిటీ ఫొటోగ్రఫీ, డిష్ స్టైలింగ్‌ను స్వయంగా నేర్చుకుంది.
ఎన్నో అవార్డులు
నెట్‌ఫ్లిక్స్ నిర్వహించిన ‘మై చెఫ్స్ టేబుల్’ పోటీలో ఇండియా నుంచి విజేతగా నిలిచిన ఏకైక ఫుడ్ అంబాసిడర్‌గా గుర్తింపు దక్కించుకుంది.
2017లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సేవ్ యువర్ బ్లాగ్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఫుడ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్’ అవార్డును గెలుచుకుంది.
బెస్ట్ ఫుడ్ మైక్రోబ్లాగర్ అవార్డు అందుకుంది.
2025లో ‘సోషల్ సమోసా’ నుంచి ప్రతిష్టాత్మక ‘సూపర్‌వుమన్ అవార్డు’ను కైవసం చేసుకుంది.
ఆరోగ్యకరమైన, రుచికరమైన లంచ్‌బాక్స్ వంటకాలతో ఉమ ‘మై జీనియస్ లంచ్ బాక్స్’ అనే ప్రసిద్ధ వంటల పుస్తకాన్ని కూడా రాసింది.
