ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంచలన నిర్ణయం: 20 వేల మంది మహిళా అడ్వైజర్ల రిక్రూట్మెంట్

ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంచలన నిర్ణయం: 20 వేల మంది మహిళా అడ్వైజర్ల రిక్రూట్మెంట్

ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో ఒక కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా కొత్తగా 20వేల మంది మహిళా అడ్వైజర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 'నారీశక్తి' ఇనిషియేటివ్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ 15న ఈ సరికొత్త రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను లాంచ్ చేసింది కంపెనీ.

ప్రస్తుతం కంపెనీలో మొత్తం అడ్వైజర్ల బేస్‌లో మహిళల వాటా సుమారు 32 శాతంగా ఉండగా.. ఏజెన్సీ వ్యాపారంలో మాత్రం వారు ఏకంగా 45 శాతం వాటాను కలిగి ఉందట. ముఖ్యంగా బెంగళూరు, కేరళ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో మహిళా అడ్వైజర్లు తమ ఏజెన్సీ వ్యాపారంలో సగం కంటే ఎక్కువ వాటాను అందిస్తున్నారు. సెప్టెంబర్ 30, 2026 నాటికి కంపెనీ వద్ద 78వేల మందికి పైగా మహిళా అడ్వైజర్లు అందుబాటులో ఉన్నారు.

మహిళా అడ్వైజర్లు కేవలం సంఖ్యాపరంగానే కాకుండా ప్రతిభలోనూ దూసుకుపోతున్నారు. సెప్టెంబర్ నాటికి ఉన్న మహిళా అడ్వైజర్లలో దాదాపు 47 శాతం మంది పదేళ్లకు పైగా కంపెనీతో అనుబంధం కలిగి ఉన్నారు. అంతేకాకుండా.. గ్లోబల్ ఇన్సూరెన్స్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేవారికి లభించే ప్రెస్టీజియస్ మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ గుర్తింపును 500 మందికి పైగా మహిళా అడ్వైజర్లు సాధించారు. గృహిణులు, శాలరీడ్ ఉద్యోగులు, వ్యాపారులు ఇలా వివిధ రంగాల నుంచి మహిళలు ఈ వృత్తిలోకి వస్తున్నారని ఐసీఐసీఐ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమీష్ బ్రేకన్ తెలిపారు.

ALSO READ : అంబానీని కలవనున్న అమెరికా విదేశాంగ కార్యదర్శి..

2024లో ప్రారంభించిన 'నారీశక్తి' ఇనిషియేటివ్ కింద మహిళలు ఎలాంటి ముందస్తు పెట్టుబడి లేకుండానే ఫైనాన్షియల్ ప్లానర్లుగా కెరీర్ ప్రారంభించడానికి అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నారు. మహిళలకు అనుకూలమైన పనివేళలు, ప్రత్యేక శిక్షణ, అవసరమైన సపోర్ట్‌ను ఈ వేదిక ద్వారా అందిస్తున్నారు. మహిళలు కస్టమర్ల అవసరాలను ఇట్టే అర్థం చేసుకుని సరైన సలహాలు ఇవ్వగలరని.. ఆఫ్టర్ సేల్స్ కూడా చక్కటి కస్టమర్ రిలేషన్ అండ్ రెస్పాన్స్ కొనసాగించగలరని ఐసీఐసీఐ ప్రశంసించింది.

ప్రభుత్వం నిర్దేశించిన 2047 నాటికి దేశంలో అందరికీ ఇన్సూరెన్స్ లక్ష్యాన్ని సాధించడంలో ఈ మహిళా శక్తి కీలక పాత్ర పోషిస్తుందని ఐసీఐసీఐ నమ్ముతోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు.. కంపెనీ ఏజెన్సీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోవాలని ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ సిద్ధం చేసింది.