అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అక్టోబర్ 17 నుంచి 22 వరకు భారత్‌లో పర్యమించనున్నారు. ఇందులో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని కలవనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని రూబియో సందర్శించనున్నట్లు యూఎస్ అంబాసిడర్ సెర్గియో గోర్ తెలిపారు. ఈ సమావేశం ద్వారా భారత్-అమెరికా మధ్య వ్యాపార, ఇంధన సంబంధాలు మరింత బలపడనున్నాయి.
అమెరికాలో దాదాపు 50 ఏళ్ల తర్వాత కొత్త క్రూడ్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ నిర్మాణంలో రిలయన్స్ భాగస్వామ్యం కావడానికి ఒప్పందం కుదిరిన 7 నెలల తర్వాత ఈ భేటీ జరుగుతోంది. ఈ నూతన ప్రాజెక్ట్ ద్వారా రోజువారీగా అమెరికన్ షేల్ ఆయిల్ సుమారు లక్షా 68వేల బ్యారెళ్లను ప్రాసెస్ చేయనుంది. ఈ రిఫైనరీలో ఉత్పత్తి అయ్యే ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి రిలయన్స్ 20 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. వాషింగ్టన్, భారతీయ దిగ్గజ వ్యాపార సంస్థలతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతుందనడానికి ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా నిలుస్తోంది.
గతంలో ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా నుంచి రాయితీపై భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడంపై అమెరికా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన రంగంలో సహకారానికే అమెరికా పెద్దపీట వేస్తోందని ఈ పర్యటన స్పష్టం చేస్తోంది. ముంబైలో ప్రభుత్వ ఉన్నతాధికారులను కూడా మార్కో రూబియో కలవనున్నారు. ఇంధన రంగంలో పెట్టుబడులు, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై ఈ చర్చలు ఫోకస్ అవనున్నాయని సమాచారం.
ALSO READ : ఎలాన్ మస్క్‌ను కొడతాను అంటున్న బీజేపీ ఎంపీ ఎవరు..?
అలాగే ఎలాన్ మస్క్, ముకేష్ అంబానీల మధ్య భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్ లోకి స్టార్‌లింక్ ప్రవేశంపై పోటీ నడుస్తున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మస్క్ అంబానీని ఉద్దేశించి చేసిన సోషల్ మీడియా పోస్టులు వివాదాస్పదమైనప్పటికీ.. వాటిని పక్కన పెట్టి అమెరికా ప్రభుత్వం రిలయన్స్‌తో బలమైన భాగస్వామ్యానికే మొగ్గు చూపుతుండటం మెుత్తం స్టోరీనే మార్చేస్తోంది.
