ఎలాన్ మస్క్‌ను కొడతాను అంటున్న బీజేపీ ఎంపీ ఎవరు..?

ఎలాన్ మస్క్‌ను కొడతాను అంటున్న బీజేపీ ఎంపీ ఎవరు..?

మధ్యప్రదేశ్‌లోని రీవా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనార్థన్ మిశ్రా తన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు. రీవాలో సంస్కృత విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం నిర్వహించిన ఒక ప్రత్యేక సభలో మాట్లాడుతూ.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని, దేశ ప్రధాని మోడీ నాయకత్వాన్ని పొగుడుతూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

ఎలాన్ మస్క్ ఎంత గొప్ప వ్యాపారవేత్త అయినా సరే భారత్‌లో వ్యాపారం చేయాలంటే ఇక్కడి నిబంధనలకు తలవంచాల్సిందేనన్నారు జనార్థన్. ఎలాన్ మస్క్‌ని రెండు గుద్దులు గుద్దుతానని.. దెబ్బకి పారిపోతాడంటూ ఏంపీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ను మస్క్ కొనుగోలు చేశారేమోనని, కానీ భారత్‌ను మాత్రం ఎవరూ కొనుగోలు చేయలేరని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రధాని మోడీ 56 అంగుళాల ఛాతీ కలిగిన బలమైన నేత అని.. ఆయనను, ఇండియాను ఎవరూ బెదిరించలేరని, ఎవరి గుసగుసలకూ లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇండియా రూల్స్ నచ్చి బిజినెస్ చేసుకుంటాం అంటే ఆహ్వానం పలుకుతామని లేదంటే తిరిగి వెళ్లిపోవచ్చన్నారు.

భారత్‌లో శాంతి స్థాపన, దేశాభివృద్ధే ప్రధాన ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మిశ్రా తెలిపారు. ఎలాన్ మస్క్ తన స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన 'స్టార్‌లింక్' శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌లో స్టార్‌లింక్ అనుమతుల విషయంలో నెలకొన్న జాప్యంపై గతంలో ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసురుతూ.. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై ఎంపీ జనార్థన్ మిశ్రా ఇలా బదులిచ్చారు. 

ALSO READ  : నార్త్ vs సౌత్: అమ్మాయిల స్వేచ్ఛ విషయంలో ఎవరు బెటర్..?

జనార్థన్ మిశ్రా తన విభిన్నమైన ప్రసంగాలతో పాపులర్ అయ్యారు. రీవా నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా మూడోసారి ఎంపీగా ఘన విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిపై లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తన సత్తా చాటుకున్నారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యే తత్త్వం, వివాదాస్పదమైనా సూటిగా ఉండే మాట తీరు తరచూ నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంట్రవర్సీ అవుతున్న స్టార్ లింక్ విషయంలో ఎలాన్ మస్క్ పై తనదైన స్టైల్ లో స్పందించి మరోసారి ఫేమస్ అయ్యారు ఎంపీ జనార్థన్.