పురుడు పోసిన పోలీస్..ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు

పురుడు పోసిన పోలీస్..ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు

మలేసియాలోని కౌలాలంపూర్​ సిటీలో పోలీస్​ ఉద్యోగంలో ఉంది కోమతి నారాయణన్​. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ డ్యూటీలో ఉన్నప్పుడు కోమతి దగ్గరకు వచ్చి.. ‘‘పురిటి నొప్పులు వస్తున్నాయి.. ఏదైనా సాయం చేయమని’’ అడిగింది. ఆ సమయంలో కోమతికి ఏం చేయాలో తోచలేదు. ముందుగా ఆమెను దగ్గర్లోని హాస్పిటల్​కి తీసుకెళ్లాలనుకుంది. పక్కనే ఉన్న టాక్సీని పిలిస్తే.. ఆ మహిళ పరిస్థితి చూసి.. మూడు టాక్సీల వాళ్లు ఆమెను టాక్సీలో ఎక్కించుకోడానికి ఒప్పుకోలేదు. అంత సీరియస్​గా​ ఉంది ఆమె పరిస్థితి. నాలుగో టాక్సీ అతను పరిస్థితిని అర్థం చేసుకుని ఆ మహిళను తన కారులో ఎక్కించుకున్నాడు. అప్పటికే పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆ మహిళకు నొప్పులు ఎక్కువైతున్నాయి. ఎలాగైనా ఆమె ప్రాణాలు కాపాడాలని ఆ మహిళను టాక్సీలో ఎక్కించింది. ఆమెతో పాటు కోమతి కూడా కార్లో ఎక్కింది. హాస్పిటల్​ సమీపిస్తున్న కొద్దీ ఆ మహిళకు పురిటినొప్పులు తీవ్రం కాసాగాయి. ఆమెకు సపర్యలు చేస్తూ.. ధైర్యం చెప్తూనే తీసుకెళ్తోంది. పరిస్థితి చేయి దాటింది. తనకు తెలియని పని అయినప్పటికీ కోమతి ధైర్యం చేసి ఆ మహిళకు టాక్సీలోనే పురుడు పోసింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. హాస్పిటల్​ వచ్చేసింది. యూనివర్సిటీ కేబన్​సంగ్​ మలేసియా హాస్పిటల్లో తల్లీ బిడ్డలను చేర్చింది. డాక్టర్లు తల్లీబిడ్డలకు వైద్య పరీక్షలు చేసి ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు ప్రకటించారు. ‘సకాలంలో ఆమెకు సాయం అందడం వల్లే నార్మల్​ డెలివరీ జరిగి ఇద్దరూ క్షేమంగా ఉన్నారు’ అని డాక్టర్లు కోమతిని కొనియాడారు. 27 సంవత్సరాల కోమతి చేసిన ఈ పనిని మలేసియా పోలీస్​ శాఖ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది. ఇది చూసిన నెటిజన్లు కోమతిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాదు.. పుట్టిన ఆ బాబుకు కోమతి పేరులోని అక్షరాలు కలిసేలా పేరు పెట్టుకున్నారు. మలేసియాలోని చెరాస్​ జిల్లా పోలీస్​ హెడ్​క్వార్టర్స్​లో కోమతి కోసం ప్రత్యేకంగా అభినందన సభ పెట్టి సత్కరించారు. ఈ విషయం సోషల్​ మీడియా ద్వారా తెలుసుకున్న మలేషియా రాణి టుంకు అజిజా కూడా కోమతిని ప్రశంసిస్తూ.. ట్వీట్​ చేసింది.

‘ఆ సమయంలో ఏం చేయాలో నాకు తోచలేదు. ఏమాత్రం ఆలస్యం చేసినా.. తల్లీబిడ్డల ప్రాణాలకే ప్రమాదం. సమయానికి క్యాబ్​ డ్రైవర్​ కూడా సహకరించాడు. మార్గమధ్యంలో ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. నాకు తెలిసిన పరిధిలో ఆమెకు సహకరించడానికి ప్రయత్నించాను. తప్పనిసరి పరిస్థితుల్లో డెలివరీ చేయాల్సి వచ్చింది. అసలు కారులోనే డెలివరీ అవుతుందని ఎక్స్​పెక్ట్​ చేయలేదు. దేవుని దయ వల్ల తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు’ అని చెప్పంది కోమతి.