ఏం వెలగబెట్టారని ఒక్క చాన్స్ అడుగుతున్నరు: కేసీఆర్

ఏం వెలగబెట్టారని  ఒక్క చాన్స్ అడుగుతున్నరు: కేసీఆర్
  • పది చాన్స్​లు ఇచ్చినా కాంగ్రెస్ ఏం చేయలే: కేసీఆర్ 
  • పంటలు పుష్కలంగా పండుతున్నయ్.. రైతు కంటినిండా నిద్రపోతున్నడు   
  • రౌతు ఏందో.. రత్నమేందో ఆలోచించి ఓటెయ్యాలి
  • హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం

సిద్దిపేట, వెలుగు: ఒక్క చాన్స్ అంటూ వస్తున్న పార్టీలు.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం వెలగబెట్టాయో చెప్పాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘ఒక్క చాన్స్​కాదు.. ప్రజలు పది చాన్స్​లు ఇచ్చారు. ఢిల్లీ దాకా వాళ్ల రాజ్యమే నడిచింది కదా.. అప్పుడేం చేశారు” అని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో బీఆర్ఎస్ ‘ప్రజా ఆశీర్వాద’ సభ నిర్వహించారు. ఇందులో కేసీఆర్ పాల్గొని అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు దాటినా ఇప్పటికీ దేశంలోని జనం పేదరికంతో మగ్గుతున్నారంటే సిగ్గుతో తలదించుకోవాలి. 60 ఏండ్ల కింద దళిత బంధు వస్తే.. దళితులు పేదరికంలో ఉండేవారు కాదు” అని అన్నారు. ఇప్పుడు ఒక్క చాన్స్ అడుగుతున్నోళ్లకు అనేక చాన్స్ లు ఇచ్చినా ఏమీ చెయ్యలేదని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ‘‘బీఆర్ఎస్​ప్రభుత్వం రాకముందు కరెంట్​సమస్యతో ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు నిత్యం కాలిపోతుండే. ఇప్పుడు నాణ్యమైన కరెంట్​ఇస్తుండడంతో వైండింగ్ దుకాణాలే మూతపడ్డాయి. ఒకప్పటి దీన స్థితికి కారణం.. ఇప్పుడు ఒక్క చాన్స్ అడుగుతున్న పెద్దలు వెలగబెట్టిన ఘనకార్యమే” అని విమర్శించారు. ప్రజలు ఆగమాగం కావొద్దని.. రవుతేందో, రత్నమేందో ఆలోచించుకుని ఓటు వేయాలని కోరారు. 

రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసినం..  

తొమ్మిదేండ్ల కింద తెలంగాణలో దారుణమైన పరిస్థితులు ఉండేవని కేసీఆర్ చెప్పారు. ‘‘కరువు, వలసలు, కరెంట్, నీళ్లు లేక, ఆర్థిక పరిస్థితి బాగోలేక, కొత్త కుండలోఈగ జొచ్చినట్టు.. కొత్త సంసారం ఎక్కడ మొదలుపెట్టాలో అన్నట్లు ఉన్న టైమ్​లో రాష్ట్ర ప్రజానీకం బాధ్యతను బీఆర్ఎస్​తీసుకుంది. ఆర్థిక నిపుణులతో మేధోమథనం చేసి మెదడును కరగదీసి.. చుట్టూ ఆవరించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకున్నాం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేశాం. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం, మంచినీళ్ల రంగం, గ్రామాల్లో గ్రీనరీ, పారిశుధ్యంతో పాటు పారిశ్రామిక విధానంలో తెలంగాణకు ఎవరూ పోటీ రాలేరు. కేంద్ర సహకారం లేకపోయినా, ప్రతిపక్షాలు గౌరవెల్లి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎన్నో కేసులు వేసి కుట్రలు చేసినా అధిగమించుకుంటూ ముందుకు సాగుతున్నాం. తొమ్మిదిన్నర ఏండ్లుగా సాధించిన అద్భుతమైన విజయాలు కొనసాగాలంటే మళ్లోసారి బీఆర్ఎస్​ను గెలిపించాలి” అని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

గౌరవెల్లితో లక్ష ఎకరాలకు నీళ్లు.. 

ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చేటోళ్లను నమ్మొద్దని ప్రజలకు కేసీఆర్ సూచించారు. ‘‘ఎవరో వస్తరు ఏదో చెబుతరు.. అలవికాని హామీలు ఇస్తరు.. ఆపద మొక్కులు మొక్కుతరు.. తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుల్లే.. నేను సల్లే అన్నట్టుగా యాడికి తొలుకపోతరో తెలియని వారి మాటలు నమ్మొద్దు” అని అన్నారు. ‘‘పెన్షన్​ను రూ.5 వేలకు పెంచుతామని ప్రకటించింది ఓట్ల కోసం కాదు. రైతుబంధు పెట్టుమని ఎవరూ అడగలేదు. గతంలో రైతులు తహసీల్ రకం కట్టకపోతే దర్వాజాలు ఊడపీక్కుపొయ్యేటోళ్లు. అధికారులు వస్తున్నరంటే రైతులు ఊర్ల నుంచి పోయేటోళ్లు. ఆ పరిస్థితిని రివర్స్ చేసి రైతును నిలబెట్టాలనే రైతుబంధు తెచ్చాం. ఒకప్పుడు హుస్నాబాద్ వస్తే కండ్లల్లో నీళ్లు వచ్చేవి. ఈ ప్రాంతంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతే కుండలతో నీళ్లు పోసే దుస్థితి ఉండేది. 700 ఫీట్ల మేర బోరు వేసినా నీళ్లు పడేవి కావు. ఒక్క చెక్ డ్యామ్  లేక నీటి చుక్క కనిపించేది కాదు. ఇప్పుడు హెలికాప్టర్​లో పైనుంచి చూస్తే అంతా పచ్చదనమే కనిపిస్తోంది. గౌరవెల్లి ప్రాజెక్టుతో 1.10 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. మెయిన్ కెనాల్ కోసం రూ.250 కోట్లు మంజూరయ్యాయి. పట్టుబట్టి పనులు  చేసుకుంటే ఆరు నెలల్లో లక్ష ఎకరాలకు నీళ్లు అందుతాయి” అని చెప్పారు. 

కల్లాల నిండా వడ్లు నిండుతున్నయ్.. 

బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహాసముద్రం గండిని పూర్తి చేసి భూగర్భ జలాలు పెంచామని, పడ్డ వాన చుక్కను పడిన చోటే ఆపే ప్రయత్నం చేశామని కేసీఆర్ చెప్పారు. ‘‘నాణ్యమైన కరెంటుతో గ్యారంటీ పంట వస్తోంది. వ్యవసాయాన్ని స్థీరీకరించడంతో వరి పంట పుష్కలంగా పండుతోంది. ఇప్పుడు రైతు కంటి నిండా నిద్రపోతున్నాడు. కల్లాల నిండా వడ్లు నిండుతున్నాయి. రెండు నెలలు గుంజినా కల్లాలు ఒడుస్తలేవు. రోడ్లపైకి ధాన్య రాశులు ఉత్తగ రాలేదు. దీని వెనుక ఎంతో కష్టముంది” అని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చామని, ఆడబిడ్డలు కష్టాలు తీర్చామని అన్నారు. 

మళ్లీ సీఎం హోదాలో వచ్చి గౌరవెల్లిని ప్రారంభిస్త

ఎన్నికలు కాగానే ఐదారు నెలల్లో యుద్ధ ప్రాతిపదికన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి, మళ్లీ సీఎం హోదాలో వచ్చి ప్రారంభిస్తానని కేసీఆర్ చెప్పారు. శనిగరం ప్రాజెక్టు ప్రధాన కాల్వ, కొత్తకొండ ఆలయ అభివృద్ది, సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారి వెడల్పు, ముల్కనూరు కొత్త బస్టాండు, ఎల్కతుర్తిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ గెలుపు.. బీఆర్ఎస్ కు 95 నుంచి 105 సీట్లలో గెలుపునకు నాంది కావాలని అన్నారు. బ్రహ్మండమైన మేనిఫెస్టోను ప్రకటించామని, దాన్ని కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాగా, వేదికపైనే హుస్నాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే సతీశ్​కుమార్ కు సీఎం కేసీఆర్ బీఫామ్ అందజేశారు.