- గొల్ల కురుమలకు కోటిన్నర పంచామన్న కేసీఆర్
- రెండున్నరేండ్లలో ఏడున్నర కోట్లయితయని గతంలో వ్యాఖ్య
- తీరా చూస్తే కోటి 90 లక్షలకే పరిమితం
- లైవ్ స్టాక్ లెక్కల్లో బట్టబయలైన బాగోతం
హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ గతంలో చెప్పిన గొర్రెల లెక్కలు, వాటిని అమ్ముకుంటే పెరిగే గొల్ల కురుమల సంపద ఉత్తిదే అని తేలిపోయింది. తాము కోటిన్నర గొర్లు పంపిణీ చేశామని, రెండున్నరేండ్లలో ఏడున్నర కోట్ల గొర్రెలు అవుతాయని, వాటిని అమ్ముకోవడం ద్వారా గొల్ల కురుమలకు రూ.25వేల కోట్లు వస్తాయని కేసీఆర్ చెప్పినా.. వాస్తవం మరోలా ఉంది. రెండున్నరేండ్లు కాదు, స్కీం ప్రారంభించి ఆరేండ్లు గడిచినా రాష్ట్రంలో గొర్రెల సంఖ్య ఏమాత్రం పెరగలేదు. పైగా అంతకుముందుతో పోలిస్తే 2 లక్షలు తగ్గింది. 2019 పశుగణన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.92 కోట్ల గొర్రెలు ఉండగా, తాజాగా తీసిన లైవ్‌స్టాక్ లెక్కల ప్రకారం 1.90 కోట్ల గొర్రెలు మాత్రమే ఉన్నట్లు తేలింది.
గత బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీ పథకం 2017లో ప్రారంభం కాగా, ఈ స్కీం కింద దఫదఫాలుగా 4.25 లక్షల యూనిట్లు అంటే 89 లక్షల గొర్రెలు పంపిణీ చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. కానీ మాజీ సీఎం మాత్రం పలు సందర్భాల్లో కోటిన్నర గొర్రెలు పంపిణీ చేసినట్లు చెప్పుకున్నరు.
కేసీఆర్ చెప్పిన ఏడున్నర కోట్ల గొర్రెల లెక్క ఇదీ..
‘‘రాష్ట్రంలో కోటి వరకు గొర్రెలు ఉన్నయ్. ప్రభుత్వం తరఫున కోటిన్నర గొర్రెలు పంపిణీ చేస్తున్నం. కలిపి రెండున్నర కోట్ల గొర్రెలైతయి. రెండేండ్లలో మూడు ఈతలు ఈనుతయ్.. ఇలా ఏడున్నర కోట్ల గొర్రెలు అయితయి. వీటిలో రెండున్నర కోట్లు పెంపకానికి ఉంచుకొని 5 కోట్లు అమ్ముకుంటే రూ.5 వేలకు ఒక గొర్రె చొప్పున రూ.25 వేల కోట్లు. రెండున్నర ఏండ్లలో రూ.25 వేల కోట్ల సంపదను మా తెలంగాణ గొల్లకురుమలు సృష్టించబోతున్నరు.
నేను నిండుమనస్సుతోని కొమురెల్లి మల్లన్నకు కడుపునిండ దండంపెట్టి చెప్పుతున్న. ఇది కేసీఆర్ మాట వంద శాతం నిజమై తీరుతది. మూడేండ్ల తర్వాత ఇండియాలో అత్యంత ధనవంతులైన గొల్లకురుమలు ఏ రాష్ట్రంలో ఉన్నరంటే అది తెలంగాణలో ఉన్నరనే మాట వస్తుంది మీరు చూస్తరు’ ఇవన్నీ ఏడేండ్ల కింద మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ లెక్కలు. ఇప్పుడా గొర్రెల మందలు పలుచబడ్డాయి. ఇప్పటికీ పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి నెలకొన్నది.
పక్కదారి పట్టిన స్కీం..
రాష్ట్రంలో ఉన్న 7.61 లక్షల మంది గొల్ల కురుమలకు (20 గొర్రెలు, 1 పొట్టేలు చొప్పున) ఒక యూనిట్ ను 1.25 లక్షల రూపాయల ఖర్చుతో గొర్రెల యూనిట్లను 75 శాతం సబ్సిడీపై పంపిణీ చేసే కార్యక్రమాన్ని 2017 జూన్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స్కీం కింద 4.25 లక్షల యూనిట్లు అంటే 89 లక్షల గొర్రెలు పంపిణీ చేశారు. ఈ లెక్కన గొర్రెల పంపిణీ స్కీం ఏడేండ్లలో 55 శాతం మాత్రమే అమలైంది.
ఇందులో అత్యధిక భాగం అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను తెప్పించే పేరుతో ఆఫీసర్లు, దళారులు కలిసి రీసైక్లింగ్ దందా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ స్కీమ్‌లో భారీ అవినీతి జరిగిందని కాగ్ తన రిపోర్టులో కడిగేసింది. ఆటోలు, టూవీలర్ల నంబర్లనే లారీల నంబర్లుగా చూపి వందలు, వేల గొర్రెలను వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించినట్లు రాసి కోట్లు స్వాహా చేశారని ఆధారాలతో సహా బయటపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏసీబీ విచారణలో గొర్రెల స్కీం బండారం బట్టబయలైంది. తాజాగా లైవ్ స్టాక్ లెక్కలు స్కీములో జరిగిన అవినీతికి సాక్ష్యంగా నిలిచాయి.
