SMAT 2025: ఫైనల్లో శివాలెత్తిన సన్ రైజర్స్ బ్యాటర్.. 45 బంతుల్లోనే సెంచరీతో విధ్వంసం

SMAT 2025: ఫైనల్లో శివాలెత్తిన సన్ రైజర్స్ బ్యాటర్.. 45 బంతుల్లోనే సెంచరీతో విధ్వంసం

టీమిండియా బ్యాటర్, సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషాన్ జార్ఖండ్ తరపున ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో చెలరేగి ఆడాడు. గురువారం (డిసెంబర్ 18) పూణే వేదికగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో హర్యానాపై బౌండరీల వర్షం కురిపిస్తూ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇషాన్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లతో పాటు ఏకంగా 10 సిక్సర్లు ఉన్నాయి. ఆడుతుంది ఫైనల్ మ్యాచ్ అయినప్పటికీ ఎలాంటి ఒత్తిడికి లోని కాకుండా హర్యానా బౌలర్లను ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ 14 ఓవర్లో కాంబోజ్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి శతకం అనుకున్న కిషాన్..గాల్లోకి ఎగురుతూ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. 

టీమిండియాలో చోటు కోల్పోయిన ఈ జార్ఖండ్ స్టార్ క్రికెటర్ ప్రస్తుతం జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా ఆడుతున్నాడు.   కీలకమైన ఫైనల్లో జట్టును ముందుండి నడిపిస్తూ సెంచరీ బాదేశాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న కిషాన్.. గత సీజన్ లో విఫలమయ్యాడు. ఆరంభ మ్యాచ్ లో సెంచరీ మినహాయిస్తే మిగిలిన మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. అయినప్పటికీ కిషాన్ మీద నమ్మకంతో సన్ రైజర్స్ ఈ యువ క్రికెటర్ ను ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు రిటైన్ చేసుకుంది. తనపై సన్ రైజర్స్ పెట్టుకున్న నమ్మకాన్ని కిషాన్ నిలబెట్టుకున్నాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే కెప్టెన్ ఇషాన్ కిషాన్ సెంచరీతో పాటు కుమార్ కుశాగ్ర (38 బంతుల్లో 81: 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో జార్ఖండ్ భారీ స్కోర్ చేసింది. ఆరంభంలో విరాట్ సింగ్ వికెట్ కోల్పోయినప్పటికీ కుశాగ్రతో కలిసి కిషాన్ ఓ రేంజ్ లో చెలరేగి ఆడాడు. ఇద్దరూ హర్యానా బౌలర్లపై ఆరంభం నుంచి ఎదురు దాడికి దిగారు. కిషాన్, కుశాగ్ర కలిసి రెండో వికెట్ కు ఏకంగా 82 బంతుల్లోనే 177 పరుగులు జోడించాడు. వీరిద్దరూ భారీ భాగస్వామ్యం తర్వాత స్వల్ప వ్యవధిలో ఔటైనా.. చివర్లో రాబిన్ మింజ్ (31), అనుకుల్ రాయ్ (40) చితక్కొట్టారు. దీంతో జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది.