సేమ్ అదే ప్రాబ్లమ్: మరో ఎయిర్ ఇండియా విమానం ఫ్యూయెల్ స్విచ్‎లో సాంకేతిక సమస్య

సేమ్ అదే ప్రాబ్లమ్: మరో ఎయిర్ ఇండియా విమానం ఫ్యూయెల్ స్విచ్‎లో సాంకేతిక సమస్య

బెంగళూర్: 2025, జూన్ 12 భారత విమానయాన చరిత్రలో చీకటి రోజు. 280 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం గుజరాత్‎లోని అహ్మదాబాద్‎లో కుప్పకూలింది. ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్న సెకండ్ల వ్యవధిలోనే క్రాష్​ ల్యాండ్ అయ్యింది. ఈ దుర్ఘటనలో ఒక్కరు మినహా అందరూ చనిపోయారు. ఈ ఘోర విమాన ప్రమాదానికి ఫ్లైట్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యనే కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 

తాజాగా ఇదే  సమస్య మరో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో తలెత్తింది. సోమవారం (ఫిబ్రవరి 2) కర్నాటకలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో ఇంధన నియంత్రణ స్విచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్​‎కు ముందుగానే పైలట్ దీనిని గుర్తించడంతో విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. 

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఇంధన నియంత్రణ స్విచ్‌లో లోపం ఉందని పైలట్‌ గుర్తించడంతో బెంగళూరు నుంచి లండన్ వెళ్లాల్సిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాన్ని నిలిపివేసినట్లు తెలిపింది. ఈ సమస్యను బోయింగ్‌కు తెలియజేసినట్లు వెల్లడించింది. విమానాన్ని టెక్నికల్ అధికారుల బృందం తనిఖీ చేస్తోందని పేర్కొంది.పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి తెలియజేసినట్లు తెలిపింది. ప్రయాణీకుల భద్రతే ఎయిర్ ఇండియా తొలి ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేసింది.