బెంగళూరు: బెంగళూరులో పీజీలు ఎంత అపరిశుభ్ర వాతావరణంలో, ఎంత అధ్వానంగా నిర్వహిస్తున్నారో గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. బేసిక్ రూల్స్ కూడా పాటించని 574 పేయింగ్ గెస్ట్ (PG) హాస్టల్స్కు GBA నోటీసులు జారీ చేసింది. వీటిలో 8 పీజీలను GBA అధికారులు మూసివేయించారు కూడా.
బెంగళూరులోని సీవీ రామన్ నగర్, శాంతి నగర్, గాంధీ నగర్, శివాజీ నగర్, చామరాజ్పేట్, చిక్కపేట్ ప్రాంతాల్లోని పీజీ వసతి గృహాల్లో గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంచడమే కాకుండా కనీసం స్వచ్ఛమైన తాగు నీళ్లు కూడా మెయింటైన్ చేయకుండా నడుపుతున్న 8 పీజీలను మూసేయించి.. మూడు లక్షలకు పైగా జరిమానా విధించారు.
ఉద్యోగాలు, చదువులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కోసం వచ్చి అకామిడేషన్ కోసం హాస్టళ్లలో ఉంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కొందరు పీజీ నిర్వాహకులు కాసుల కక్కుర్తితో బేసిక్ రూల్స్ పాటించకుండా హాస్టల్స్ నడుపుతున్నారు. ఆఫీసుకు వచ్చేయాలని ఉద్యోగులను ఐటీ కంపెనీలు ఆదేశించడంతో బెంగళూరులోని హాస్టల్స్ దాదాపుగా నిండిపోయాయి. వేలకు వేలు డబ్బు కట్టి పీజీల్లో ఉంటున్నా రుచీపచీ లేని కూరలు, కొంచెం తింటే తినాలనిపించని అన్నం.. ఇదీ కొన్ని పీజీల్లో ఉన్న పరిస్థితి.
హైదరాబాద్లోని కొన్ని హాస్టల్స్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. పీజీల్లో ఫుడ్ నచ్చక సెలెక్టెడ్ డేస్లో మాత్రమే పీజీల్లో తింటూ బయట ఫుడ్ తింటున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. కొందరు స్విగ్గీ, జొమాటోల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటున్న పరిస్థితి. అమీర్‌పేట్, దిల్ సుఖ్నగర్, ఎస్సార్ నగర్, మధురానగర్, కూకట్‌పల్లి, మాదాపూర్ వంటి ఏరియాల్లోని కోచింగ్ ఇనిస్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటూ దగ్గర్లోని పీజీల్లో ఉంటున్నారు. ఈ ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఫుల్ రష్ కనిపిస్తోంది.
