లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాజీ ఆర్మీచీఫ్ జనరల్ నరవణే పుస్తకాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన క్రమంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆయనకు మద్దతుగా నిలిచారు. భారత సైన్యం పరువు తీయొద్దంటూ రాహుల్ ప్రకటనపై ప్రభుత్వం అభ్యంతరం చెప్పడాన్ని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకం నుంచి ఓ సారాంశాన్ని చదివాడని అది అప్పటికే ఓ పత్రికలో ప్రచురించబడిందని అన్నారు. ఇందులో పరువు నష్టం ఏముందని ప్రశ్నించారు.
పుస్తకం అయినా, పత్రిక అయినా మూలాలు బహిరంగంగానే ఉంటాయి. ఇక్కడ ధృవీకరంచని మూలం అంటూ ఏదీ లేదు.. మోదీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో అర్థంకావడంలేదన్నారు ప్రియాంక. అంతకుముందు మీడియాతో మాట్లాడిన రాహుల్.. ఆర్మీ చీఫ్ పుస్తకంలో ని విషయాలు బీజేపీ అగ్ర నేతల చర్యలు, చైనా పట్ల ప్రభుత్వ వైఖరి వెనక ఉన్న వాస్తవాలను బహిర్గతం చేస్తాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోందని ఆరోపించారు. 56 అంగుళాల ఛాతికి ఏమి జరిగిందో బహిర్గతం చేస్తుందని రాహుల్ అన్నారు.
ఈ అంశంపై లోక్‌సభలో పదే పదే గందరగోళం నెలకొంది. రెండుసార్లు వాయిదా పడింది.చివరగా సాయంత్రం 4:10 గంటలకు వాయిదా పడింది. వాయిదా తర్వాత, రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రాంగణంలో తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ‘‘ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ,మొత్తం ప్రభుత్వం మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంలోని ఒక్క లైన్‌కు మాత్రమే భయపడుతున్నాయి..నేను పార్లమెంటులో అదే లైన్ పై మాట్లాడతాను..నన్ను ఎవరూ ఆపలేరు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేత సభను తప్పుదారి పట్టించారని, సాయుధ దళాలను ప్రశ్నిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , బీజేపీ ఆరోపించాయి. రాహుల్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, సైన్యం నైతికతను తగ్గించే వ్యాఖ్యలపై చర్యలు తప్పవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు హెచ్చరించడంతో రేపు సభలో ఏం జరగబోతోందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
#WATCH | Priyanka Gandhi Defends Rahul Gandhi’s Remark In Parliament.#PriyankaGandhi #RahulGandhi #Parliament #LokSabha #ABPLIVE pic.twitter.com/FYdVoAwXHB
— ABP LIVE (@abplive) February 2, 2026
