భారత్‎కు ట్రంప్ భారీ శుభవార్త: వాణిజ్య సుంకాలు 25 నుంచి 18 శాతానికి తగ్గింపు

భారత్‎కు ట్రంప్ భారీ శుభవార్త: వాణిజ్య సుంకాలు 25 నుంచి 18 శాతానికి తగ్గింపు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు భారీ శుభవార్త చెప్పారు. భారత్‎పై పరస్పర వాణిజ్య సుంకాలను 25 నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్రూత్‎లో టారిఫ్‎ల తగ్గింపుపై ట్రంప్ ప్రకటన చేశారు. ప్రధాని మోడీ పట్ల తనకున్న గౌరవం, స్నేహం కారణంగా సుంకాలను 18 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు. ఇండియా, అమెరికా మధ్య ట్రేడ్ డీల్‎కు కుదిరిందని తెలిపారు. 

ఇండియా, అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి సోమవారం (ఫిబ్రవరి 2) ప్రధాని మోడీ, ట్రంప్ ఫోన్‌లో చర్చించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు.  

“సోమవారం (ఫిబ్రవరి 2) ఉదయం భారత ప్రధాని మోడీతో మాట్లాడా. మేము వాణిజ్యం, రష్యా –ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించడం వంటి అనేక విషయాల గురించి చర్చించాం. రష్యన్ చమురు కొనుగోలును ఆపడానికి.. అమెరికా, వెనిజులా నుంచి ఇంధనం కొనుగోలు చేయడానికి ఆయన అంగీకరించారు. మోడీతో మాట్లాడటం గౌరవంగా ఉంది.

ఆయన నా అత్యంత సన్నిహితులలో ఒకరు. మోడీ దేశానికి శక్తివంతమైన, గౌరవనీయ నాయకుడు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేడయం వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో సహాయపడుతుందని అన్నారు. భారత్‎తో మా బంధం మరింత  బలంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.