మేడారంలో కొనసాగుతున్న రద్దీ.. గద్దెల వద్ద కిటకిటలాడుతున్న భక్తులు

మేడారంలో కొనసాగుతున్న రద్దీ.. గద్దెల వద్ద కిటకిటలాడుతున్న భక్తులు

తాడ్వాయి, వెలుగు : మేడారం జాతర ముగిసినప్పటికీ భక్తుల రాక కొనసాగుతూనే ఉంది. ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉదయమే మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసిన అమ్మవార్లను దర్శించుకొని, ఎత్తు బంగారం, పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆదివారం సుమారు పది లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఈవో వీరస్వామి తెలిపారు. కాగా, మేడారంలో ఏర్పాటు చేసిన హుండీలను హనుమకొండలోని టీటీడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఆదివారం సాయంత్రం పూజారులు కొబ్బరికాయలు కొట్టి హుండీలను కదిలించారు. అనంతరం పోలీస్‌‌ భద్రత నడుమ వాహనాల్లోకి ఎక్కించారు. సోమవారం ఉదయం వరకు హుండీలను హనుమకొండకు తరలించనున్నట్లు ఈవో తెలిపారు. 

పూనుగొండ్లకు చేరుకున్న పగిడిద్దరాజు

కొత్తగూడ (గంగారం), వెలుగు : మహాజాతర ముగియడంతో శనివారం రాత్రి మేడారం నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు ఆదివారం రాత్రి పూనుగొండ్లకు చేరుకున్నారు. మేడారం నుంచి కాలినడకన వచ్చిన పూజారులు పగిడిద్దరాజు ప్రతిమను ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ నెల 4 నుంచి ఆరవ తేదీ వరకు తిరుగువారం జాతర నిర్వహించనున్నట్లు పూజారులు రాజేశ్వర్, సురేందర్‌‌, పురుషోత్తం తెలిపారు. 

బస్సుల కోసం భక్తుల ఎదురుచూపులు

ములుగు, వెలుగు : మేడారం జాతర ముగియడంతో తిరుగుప్రయాణం అవుతున్న భక్తులు బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క బస్సు కోసం అరగంటపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. బస్టాండ్‌‌లో ఎలాంటి క్యూలైన్లు, ఆర్టీసీ సిబ్బంది కనిపించకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. తిరుగువారం వరకు భక్తులు వస్తూనే ఉంటారన్న విషయం తెలిసినా కంట్రోలర్, ఇతర సిబ్బంది లేకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.