బెంగళూరు: కర్ణాటకలోని విజయనగర జిల్లా పరిధిలో అమానుష ఘటన జరిగింది. తల్లిని, తండ్రిని, చెల్లిని ఒకరికి తెలియకుండా ఒకరిని హత్య చేసి ఒకే గుంతలో ముగ్గురినీ పాతిపెట్టాడు ఒక కర్కోటకుడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టావని ఆ యువకుడిని అడగ్గా.. ఒక్కోసారి ఒక్కోలా పొంతన లేని కట్టు కథలు చెప్పాడు. తన చెల్లి ప్రేమ వ్యవహారం నడుపుతోందని, ఆమె ప్రెగ్నెంట్ అయిందని.. ఈ విషయం అందరికీ తెలిస్తే పరువు పోతుందనే భయంతో ఆమెతో పాటు తల్లీతండ్రిని చంపేశానని నిందితుడు పోలీసులకు చెప్పుకొచ్చాడు. పోలీసులు పరువు హత్యగానే భావించినా.. నిందితుడి లైఫ్ స్టైల్, అతని దురలవాట్లు తెలిశాక తన తండ్రి ఇల్లు అమ్మగా వచ్చిన కోటిన్నర డబ్బు కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
అక్షయ్ అనే ఈ యువకుడు బెట్టింగ్, గ్యాంబ్లింగ్కు బానిసగా మారాడు. లక్షల్లో అప్పులు చేశాడు. ఆ డబ్బు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్న సమయంలో తన తండ్రి దగ్గర ఇల్లు అమ్మేయగా వచ్చిన కోటిన్నర డబ్బు ఉందని అక్షయ్కు తెలిసింది. ఆ డబ్బు తనకు ఇవ్వాలని అక్షయ్ అడగ్గా.. అందుకు అతని తండ్రి ఒప్పుకోలేదు. తన తల్లి కూడా ఆ డబ్బు విషయంలో అతని మాటను పట్టించుకోలేదు. చెల్లి పెళ్లి కోసం దాస్తున్న డబ్బులని.. రెండు, మూడేళ్లలో చెల్లి పెళ్లి చేసి కట్నంగా ఇచ్చేందుకు ఇల్లు అమ్మేసినట్లు తల్లిదండ్రులు చెప్పారు. ఆ డబ్బు తనకు దక్కకపోవడానికి తన చెల్లినే కారణమని ఆమెపై కూడా నిందితుడు ద్వేషం పెంచుకున్నాడు. ముగ్గురినీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
మొదటగా ఇంట్లో ఒంటరిగా ఉన్న తల్లిని చంపేశాడు. ఆ తర్వాత.. అతని చెల్లిని చంపేశాడు. బయటకు వెళ్లి వచ్చిన తండ్రి టీవీ చూస్తుండగా ఆయనను కూడా చంపేశాడు. ఇలా ఒక్కొక్కరినీ చంపేసి ముగ్గురినీ ఇంట్లోని హాల్లో గుంత తవ్వి ఒకే గొయ్యిలో పాతి పెట్టాడు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే.. పాతిపెట్టే సమయంలో తన తండ్రి కాళ్లు పొడవుగా ఉండి అడ్డొస్తున్నాయని రెండు కాళ్లను నరికేసి అదే గొయ్యిలో వేసి పాతేశాడు. ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. కర్ణాటకలోని విజయనగర జిల్లా కొట్టూరు పట్టణంలో ఈ దారుణ ఘటన జరిగింది.
