భారీ జీతాలున్నా సేవింగ్స్ చేయలేకపోతున్న నేటి తరం.. ఎక్కడ తప్పు జరుగుతోందంటే..?

భారీ జీతాలున్నా సేవింగ్స్ చేయలేకపోతున్న నేటి తరం.. ఎక్కడ తప్పు జరుగుతోందంటే..?

మన చిన్నప్పుడు నాన్న ఒక్కరే సంపాదించినా.. ఇంటి ఖర్చులు పోను ఎంతో కొంత సేవ్ చేసేవారు. కానీ ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నా.. భారీ జీతాలు తీసుకుంటున్నా, నెలాఖరుకు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదు. ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు.. ఎంత మిగిల్చుకుంటున్నాం అనే విషయంలో కొత్త తరం తీవ్ర ఆందోళన చెందుతోంది. అసలు మన తల్లిదండ్రుల కాలానికి, ఇప్పటికీ మారిన ఆర్థిక పరిస్థితులు ఏంటో ఓసారి చూద్దాం.

1. ఖర్చుల 'బేస్ రేట్' పెరిగింది:
ఒకప్పుడు అద్దె, తిండి, చదువుకు తక్కువ ఖర్చయ్యేది. కానీ ఇప్పుడు మెట్రో నగరాల్లో ఒక మాదిరి జీవితం గడపాలంటే కనీసం రూ.50వేలు ఖర్చు అవుతోంది. అద్దెకే ఆదాయంలో 30 శాతం వరకు పోతుండగా.. ఇక ఎడ్యుకేషన్, హెల్త్ ఖర్చులు చుక్కలను తాకుతున్నాయి. ఏ విలాసాలకు పోకపోయినా బతుకు బండిని నడవడమే భారంగా మారింది.

2. సబ్‌స్క్రిప్షన్ మాయాజాలం:
మన తల్లిదండ్రులకు కేబుల్ బిల్లు తప్ప ఇతర నెలవారీ చెల్లింపులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఓటిటి, జిమ్ యాప్స్, మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్లు, క్లౌడ్ స్టోరేజ్.. ఇలా చిన్న చిన్న మొత్తాలే అయినా అన్నీ కలిసి వేల రూపాయలను మాయం చేస్తున్నాయి. దీనికి తోడు ఫుడ్ డెలివరీ యాప్స్ అలవాటు సేవింగ్స్‌ను మరింత దెబ్బతీస్తోంది.

3. 'EMI'ల ఉచ్చు:
ముందు దాచుకుని తర్వాత వస్తువు కొనే రోజులు పోయాయి. ఇప్పుడు ముందు వాడుకో - తర్వాత కట్టు అనే EMI సంస్కృతి పెరిగింది. రూ.70వేలు విలువైన ఫోన్ నెలకు రూ.3వేలకే వస్తుందని ఆశపడి కొంటాం. కానీ అది మన భవిష్యత్తు ఆదాయాన్ని లాక్ చేస్తోందని చాలా మంది గుర్తించటం లేదు. ఇక కారు, ఇల్లు, గ్యాడ్జెట్ల EMIల వల్ల ఆర్థిక స్వేచ్ఛ పూర్తిగా పోతోంది.

4. ఇన్‌స్టాగ్రామ్ ట్యాక్స్:
సోషల్ మీడియా పుణ్యమా అని మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం ఎక్కువైంది. పక్కింటి వారితో కాకుండా, ప్రపంచంలో ఎక్కడో వెళ్తున్న విదేశీ టూర్లు, కొత్త కార్లు చూసి.. అవసరం లేకపోయినా 'లైఫ్ స్టైల్' అప్‌గ్రేడ్ కోసం అనవసరంగా ఖర్చు చేస్తున్నాం.

5. ఉద్యోగ అనిశ్చితి:
నేటి కాలంలో 'గిగ్ ఎకానమీ' వల్ల ఉద్యోగ భద్రత కరువైంది. మన తల్లిదండ్రులు దశాబ్దాల పాటు ఒకే ఉద్యోగంలో ఉండేవారు. కానీ నేడు లే-ఆఫ్స్, తరచుగా ఉద్యోగాలు మారడం వల్ల భవిష్యత్తుపై భయం పెరిగింది. ఈ అనిశ్చితి వల్ల డబ్బును దీర్ఘకాలిక పెట్టుబడుల్లో లాక్ చేయడానికి భయపడి, అత్యవసరాల కోసం నగదు రూపంలోనే ఉంచుతున్నారు.

6. వాయిదా వేసే ధోరణి:
చాలామంది "వచ్చే ఏడాది జీతం పెరిగాక దాచుకుందాం"లే అని సేవింగ్స్ ను వాయిదా వేస్తుంటారు. ప్రస్తుత అవసరాలైన కొత్త ఫోన్ లేదా వెకేషన్లకే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఒక్క ఏడాది ఆలస్యం చేసినా, కాంపౌండింగ్ ద్వారా వచ్చే లక్షల రూపాయల లాభాన్ని కోల్పోతామని గుర్తించాలి. చిన్న వయసులోనే సేవింగ్స్ మొదలుపెట్టే అలవాటు భవిష్యత్తులో భారీ నిధిని సమకూరుస్తుంది.

7. అతిగా ఆలోచించడం:
ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, SIP, PPF వంటి ఎన్నో ఆప్షన్లు ఉండటంతో ఏది ఎంచుకోవాలో తెలియక చాలామంది అసలు పెట్టుబడి నిర్ణయమే తీసుకోలేకపోతున్నారు. ఈ అయోమయం వల్ల విలువైన సమయం వృథా అవుతోంది. సరైన ప్రణాళికతో, తక్కువతోనైనా పెట్టుబడిని వెంటనే ప్రారంభించడం ముఖ్యం.

పరిస్థితులు మారాయి నిజమే.. కానీ పొదుపు అసాధ్యం కాదని నేటి తరం ప్రజలు. అనవసర ఖర్చులను తగ్గించుకుని, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి అలవాటు చేసుకుంటేనే భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని ఇప్పటికైనా ప్రజలు గమనించాలి.