Avatar 3 Review : జేమ్స్ కామెరాన్ విజువల్ మ్యాజిక్.. 'అవతార్: ఫైర్ అండ్ యాష్' టాక్ ఎలా ఉందంటే?

Avatar 3 Review : జేమ్స్ కామెరాన్ విజువల్ మ్యాజిక్.. 'అవతార్: ఫైర్ అండ్ యాష్' టాక్ ఎలా ఉందంటే?

హాలీవుడ్ సంచలన దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన అద్భుత ప్రపంచం 'పండోర' మరోసారి వెండితెరపై కనువిందు చేసేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవతార్: ఫైర్ అండ్ యాష్' (Avatar: Fire and Ash) రేపు (డిసెంబర్ 19, 2025) థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రీమియర్ షోల టాక్, సినీ దిగ్గజాల రివ్యూలతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈ అవతార్ 2పై సినీ ప్రముఖులు, నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం..

'ఫైర్ అండ్ యాష్' కథాకమిషీ!

మొదటి భాగంలో అడవులను, రెండో భాగంలో సముద్రాలను చూపించిన జేమ్స్ కామెరాన్ .. మూడో భాగంలో 'అగ్ని' తత్వాన్ని పరిచయం చేశారు.. పండోర గ్రహంలోని 'యాష్ పీపుల్' (Ash People) అనే కొత్త తెగను ఈ సినిమాలో చూపించారు.. వీరు ఇతర నావి తెగల కంటే భిన్నంగా, కొంత క్రూరంగా ఉంటారు.  

వణికించే కొత్త విలన్!

ఈసారి  'అవతార్: ఫైర్ అండ్ యాష్' సినిమాలో ప్రధాన ఆకర్షణ విలన్ పాత్రే. వరాంగ్ (Varang) అనే పవర్‌ఫుల్ నావి పాత్రలో ఊనా చాప్లిన్ నటిస్తున్నారు. ఈమెను 'ఫాలెన్ నావి' (Fallen Na'vi) అని పిలుస్తారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన తండ్రిని చంపి, మాంగ్‌క్వాన్ క్లాన్‌కు నాయకురాలిగా మారిన వరాంగ్.. జేక్ సల్లీ కుటుంబానికి ఎలాంటి సవాళ్లు విసురుతుందనేది ఈ సినిమా కథాంశం.

రాజమౌళి, సుకుమార్ ప్రశంసల జల్లు!

ఈ మూవీపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ దర్శకులు ఇప్పటికే ఈ సినిమాను వీక్షించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. "ఫైర్ అండ్ యాష్ చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ఆ విజువల్స్, క్లిష్టమైన సన్నివేశాలను చూస్తుంటే థియేటర్లో ఒక చిన్నపిల్లాడిలా అనిపించిందన్నారు  దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి . వరాంగ్ పాత్ర అద్భుతంగా ఉంది అని కొనియాడారు.  జేమ్స్ కామెరాన్ సృష్టించిన ఈ అద్భుతానికి హ్యాట్సాఫ్ అని అన్నారు. 

ఇక ఈ చిత్రాన్ని  బ్లాక్ బస్టర్ అని టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ అభివర్ణించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు మరో ప్రపంచానికి వెళ్లినట్లు ఉందని అన్నారు. తెలుగు సినిమాల్లో ఉన్నన్ని ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగంతో కళ్లలో నీళ్లు వచ్చాయి. సినిమా అంటే ఇదీ అనిపించింది. ఇలాంటి చిత్రాలను థియేటర్లలో చూస్తేనే ఎంజాయ్ చేయగలమని చెప్పారు సుకుమార్.

ఆస్కార్ బరిలో అవతార్-3

విడుదలకు ముందే ఈ చిత్రం నాలుగు ఆస్కార్ కేటగిరీల్లో షార్ట్‌లిస్ట్ అయ్యింది . వాటిల్లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ , బెస్ట్ ఒరిజినల్ స్కోర్ , బెస్ట్ సౌండ్ ,  అదే విధంగా మైలీ సైరస్ పాడిన 'డ్రీమ్ యాజ్ వన్' బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కింద షార్ట్ లిస్ట్ అయింది. థియేటర్లలోకి రాకముందే ఈ చిత్రం నాలుగు ఆస్కార్  కేటగిరిలో నమోదుకావడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.  

బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు..

3 గంటల 17 నిమిషాల సుదీర్ఘ నిడివి ఉన్నప్పటికీ, ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, మొదటి వీకెండ్‌లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 340 మిలియన్ల నుండి 380 మిలియన్ల డాలర్లు వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. మరో వైపు ఈ మూవీపై మిశ్రమ స్పందనలు కూడా వస్తున్నాయి. . కొందరు విమర్శకులు మాత్రం సినిమా నిడివి ఎక్కువగా ఉందని, భావోద్వేగాల కంటే విజువల్స్ కే ప్రాధాన్యత ఇచ్చారని పెదవి విరుస్తున్నారు. అయినప్పటికీ, జేమ్స్ కామెరాన్ మార్క్ మేకింగ్‌ను ఎంజాయ్ చేసే వారికి ఇది ఒక గొప్ప విజువల్ ట్రీట్ అని చెప్పవచ్చు.