ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడనుందనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో కేంద్ర పెట్రోలియం మరియు గ్యాస్ శాఖ వినియోగదారులకు కీలక సూచన చేసింది. దేశంలోని డొమెస్టిక్ LPG కస్టమర్లు తప్పనిసరిగా e-KYC చేసుకోవాలని సూచించింది. ఈ-కేవైసీ ప్రాసెస్ పూర్తిగా ఉచితమని, చాలా సులువుగా, సౌకర్యవంతంగా చేసుకోవచ్చని తెలిపింది. ఇంట్లో ఉండే మీ స్మార్ట్ ఫోన్లో నిమిషాల్లోనే e-KYC పూర్తి చేసుకోవచ్చని సూచించింది.
सभी घरेलू #LPG उपभोक्ताओं को बायोमेट्रिक आधार प्रमाणीकरण (e-KYC) कराना अनिवार्य है।
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) March 10, 2026
e-KYC प्रक्रिया निःशुल्क, सरल और सुविधाजनक है।
इसे आप घर बैठे अपने स्मार्टफोन से कुछ ही मिनटों में पूरा कर सकते हैं।
बायोमेट्रिक आधार प्रमाणीकरण (e-KYC) प्रारंभ करने एवं विस्तृत जानकारी के लिए… pic.twitter.com/LIxorWzuBr
e-KYC ఎలా చేసుకోవాలనే విషయంలో కంగారు పడాల్సిన పనేం లేదని.. https://pmuy.gov.in/e-kyc.html వెబ్ సైట్ను విజిట్ చేసి తెలుసుకోవచ్చని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులంతా ఆధార్ కార్డుతో ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని గతంలోనే ఒక సర్క్యులర్ జారీ చేసింది. మరణించిన వారి పేరిట ఉన్న కనెక్షన్లపై కొంతమంది గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నారని, అవి పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది.
ఇండ్లలో వంట కోసం వాడే డొమెస్టిక్ ఎల్‌పీజీ 14 కిలోల సిలిండర్ ధరను 60 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. గడిచిన 11 నెలల్లో గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. ఏప్రిల్ 2025లోనూ గ్యాస్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో ప్రస్తుతం 14.2 కిలోల నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913కు చేరింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. వీరికి వచ్చే రూ.300 సబ్సిడీ పోగా సిలిండర్ ధర రూ.613 గా ఉంటుంది.
►ALSO READ | ముంచుకొస్తున్న LPG సంక్షోభం.. వంట గ్యాస్‌పై కేంద్రం కీలక నిర్ణయం
వాణిజ్య అవసరాలకు వాడే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర కూడా రూ.114.50 పెరిగింది. దీంతో ఢిల్లీలో దీని ధర రూ.1,883 కు చేరింది. ఈ ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.302 పెరిగింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మిడిల్ఈస్ట్ నుంచి చమురు రవాణా జరిగే హోర్మూజ్ జలసంధి మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి.
భారత్ దిగుమతి చేసుకునే ఎల్పీజీలో దాదాపు 90 శాతం ఈ మార్గం నుంచే వస్తోంది. ఖతర్ నుంచి ఎగుమతులు ఆగిపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. సరఫరా నిలిచిపోవడం వల్ల దేశీయంగా గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రభుత్వం అత్యవసర అధికారాలను ఉపయోగించి రిఫైనరీలలో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది.
