స్కిల్స్ పెంచుకుంటే ఏఐతో ఉద్యోగాలు పోవు..మరిన్ని అవకాశాలు వస్తయ్: మంత్రి వివేక్ వెంకటస్వామి

స్కిల్స్ పెంచుకుంటే ఏఐతో ఉద్యోగాలు పోవు..మరిన్ని అవకాశాలు వస్తయ్: మంత్రి వివేక్ వెంకటస్వామి
  •   మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు అప్​స్కిల్ అయ్యేందుకు అన్ని నియోజకవర్గాల్లో ఏటీసీలు
  •     టీవర్క్స్‌‌లో నిర్వహించిన ఫ్యూచర్ స్కిల్స్ సమిట్ అవార్డ్స్‌‌ కార్యక్రమంలో కామెంట్స్​

హైదరాబాద్, వెలుగు: వేగంగా మారుతున్న ప్రపంచ సాంకేతిక విప్లవానికి అనుగుణంగా యువత నైపుణ్యాలను మెరుగుపర్చుకొని భవిష్యత్‌‌‌‌ అవకాశాలను సొంతం చేసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలు పోతాయన్న భయం వద్దన్నారు. ఏఐ, రోబోటిక్స్, ఆటోమేషన్, డేటాసైన్స్ వంటి టెక్నాలజీలు పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. కాబట్టి, సాంప్రదాయ కోర్సుల విద్య మాత్రమే సరిపోదని, ఏఐ యుగానికి అవసరమయ్యే డిజిటల్ లిటరసీ, కొత్త టెక్నాలజీలపై స్కిల్స్‌‌ పెంపొందించుకోవాలని సూచించారు.

అప్పుడే దేశహద్దులు దాటినా మరిన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. శనివారం టీవర్క్స్‌‌లో క్వాలిటీ థాట్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఫ్యూచర్ స్కిల్స్ సమిట్, అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, ఉపాధి కల్పన విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన స్టార్టప్‌‌లు, విద్యాసంస్థలు, ఆవిష్కర్తలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌‌ మాట్లాడుతూ.. విద్యా సంస్థలు, పరిశ్రమలు, పాలకుల మధ్య బలమైన అనుసంధానం ఏర్పడితేనే గ్లోబల్ మార్కెట్‌‌లో తెలంగాణ యువత రారాజులుగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు అప్‌‌ స్కిల్లింగ్‌‌ అవుతూ ఉండాలని, అప్పుడే ఏఐ సవాళ్లను అవకాశాలుగా మలచుకోగల్గుతామని పేర్కొన్నారు. 

119 నియోజకవర్గాల్లో ఏటీసీల నిర్మాణం..

రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలు పెంపొందించేలా 119 నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌‌డ్‌‌ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టాటా గ్రూప్‌‌తో ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారా పాత ఐటీఐలను సరికొత్త ల్యాబ్‌‌లు, డిజిటల్ ఉపకరణాలు, రోబోటిక్స్ మిషన్లతో ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా పారిశ్రామిక అవసరాలకు తగిన శిక్షణ లభించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. మన విద్యార్థులను గ్లోబల్ వర్క్‌‌ఫోర్స్‌‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌‌పవర్ ఏజెన్సీ (టామ్‌‌కామ్) ద్వారా జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, ఇటలీ వంటి విదేశీ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని తెలిపారు. ఆయా దేశాల్లోని స్థానిక భాషల్లో శిక్షణతో పాటు ఆ దేశాల సంస్కృతిపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. జర్మనీలో ఒక ఫిజియోథెరపిస్ట్‌‌కు నెలకు రూ.3.30 లక్షల జీతంతో ఉద్యోగం వచ్చిందని చెప్పారు. తానే ఆ అమ్మాయికి అపాయింట్‌‌మెంట్ లెటర్ ఇచ్చానన్నారు. రూ.25 లక్షల వార్షిక వేతనంతో 30 వేల ఉద్యోగాలను తమ ప్రభుత్వం గుర్తించిందని ఆయన చెప్పారు. మరోవైపు కంపెనీల ప్రస్తుత డిమాండ్‌‌కు అనుగుణంగానే పాఠ్యప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.

స్కిల్డ్ యువతను తయారు చేస్తున్నం: మంత్రి శ్రీధర్ బాబు

భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలు, టెక్నాలజీ, ఆత్మవిశ్వాసంతో కూడిన యువతను తయారుచేసేలా అడుగులు వేస్తున్నామని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. విద్య, పరిశ్రమ, ఉపాధిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి యువతను భవిష్యత్‌‌ ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ స్కిల్స్ సమిట్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమకు నైపుణ్యాలు, ప్రాక్టికల్‌‌ నాలెడ్జ్‌‌, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, కమ్యూనికేషన్‌‌, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారే శక్తి, నిరంతరం నేర్చుకునే తత్వం అవసరమన్నారు. తమ లక్ష్యం కేవలం విద్య అందించడం కాదని, ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన విద్యను అందించడమని తెలిపారు.

టాటా సన్స్‌‌ సహకారంతో రూ.2,400 కోట్లతో ఏటీసీలు సెంటర్లను భవిష్యత్‌‌ పరిశ్రమ అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దుతున్నట్టు వెల్లడించారు. యంగ్‌‌ ఇండియా స్కిల్స్‌‌ యూనివర్సిటీ దేశంలో నైపుణ్యాభివృద్ధికి కొత్త నమూనాగా నిలుస్తుందని మంత్రి చెప్పారు. నేటి యువతకు డిగ్రీలతో పాటు స్కిల్స్ చాలా కీలకమని, స్కిల్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని సైబరాబాద్​ సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రపంచం మొత్తం అవకాశాలకు కొదవ లేదని, టెక్నాలజీకి అనుగుణంగా అప్‌‌స్కిల్ అయితే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పారు.