ఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా LPG సంక్షోభం ముంచుకొస్తున్న తరుణంలో వంట గ్యాస్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ LPG గురించి కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. 10 శాతం గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేయాలని ప్రధాని మోదీ పెట్రోలియం శాఖ మంత్రికి స్పష్టం చేశారు. వంట గ్యాస్‌ను బ్లాక్‌లో అమ్ముతూ దందాకు పాల్పడితే చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు.
ఇదిలా ఉండగా.. ఒక సిలిండర్ తీసుకున్న 25 రోజుల తర్వాతే రెండో సిలిండర్ బుకింగ్ ఆప్షన్ అమల్లోకి వచ్చింది. ఇదే తరుణంలో కమర్షియల్ సిలిండర్ల జారీని ఆయిల్ కంపెనీలు నిలిపివేశాయి. దీని ప్రభావం రెస్టారెంట్లు, హోటళ్లపై తీవ్రంగా పడింది. ముంబైలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నగర హోటల్ రెస్టారెంట్ సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు కార్యకలాపాలు నిలిపివేశాయి.
గ్యాస్ సరఫరా పరిస్థితి మెరుగుపడకపోతే మరో రెండు రోజుల్లో నగరంలోని 50 శాతం వరకు హోటళ్లు మూతపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం ప్రతి హోటల్ వద్ద ఉన్న ఎల్పీజీ నిల్వల ఆధారం గానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సంఘం తెలిపింది. ఈ పరిస్థితి కొనసాగితే దేశవ్యాప్తంగా వేలాది హోటళ్లు తాత్కాలికంగా మూతపడే ప్రమాదం ఉందని హోటల్ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. బెంగళూరులో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా నిలిచిపోవడంతో ఇవాళి నుంచి నగరంలోని అనేక హోటళ్లు మూతపడ్డాయి.
