- తీగ లాగినకొద్దీ కదులుతున్న డొంక
- ఆధార్‌తో పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్న ఆర్థిక శాఖ
- రెండేసి జీతాలు బయటకు రావడంతో అప్రమత్తమైన అక్రమార్కులు
హైదరాబాద్, వెలుగు: ఒకే ఉద్యోగి రెండు వేర్వేరు చోట్ల అక్రమంగా జీతాలు దండుకుంటున్నట్లు బయటపడుతున్నాయి. తీగను లాగితే ఔట్‌సోర్సింగ్ డొంక కదులుతోంది. ఇక్కడ వేలాది మంది పేరుతో డబుల్సాలరీ తీసుకుంటున్నట్లు ప్రాథమికంగా వెలుగుచూసింది. ప్రభుత్వ ఉద్యోగుల డేటాను ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియ చేపట్టినప్పుడు రెగ్యులర్ ఉద్యోగులే ఇటు సొంత పోస్టుతోపాటు తప్పుడు మార్గంలో రెండేసి జీతాలు పొందుతున్నట్లు ఆర్థికశాఖ గుట్టురట్టు చేసింది.
నిజానికి 40 అనుమానాస్పద కేసుల్లో 80 మందిని గుర్తించినప్పటికీ ఈ సంఖ్య ఎక్కువే ఉంటున్నట్లు అనుమానిస్తున్నారు. గతంలో ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేయడంతో దొరికిపోతామని కొందరు రెగ్యులర్ ఉద్యోగులు ఒకచోట ఉద్యోగ జీతాన్ని తెలివిగా వదిలించుకున్నట్లు తెలుస్తోంది. ఇక రెగ్యులర్ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే ఔట్‌సోర్సింగ్‌లో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఆర్థికశాఖ.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది డేటాను జల్లెడ పడుతున్నది.
ఔట్ సోర్సింగ్ వర్గాల్లోనూ వేలాది మంది ఉద్యోగులు ఒకే ఆధార్ తో రెండు చోట్ల వేతనాలు పొందుతున్నట్లు ఆడిట్‌లో వెల్లడైంది. కాగా, ఈ వేతనాలను ఉద్యోగులు కాకుండా.. ఏజెన్సీలు దోచుకుంటున్నాయని అనుమానిస్తున్నారు. ఈ చర్యలతో ప్రభుత్వ ఖజానా నుంచి కొన్నేళ్లుగా వందల కోట్లు పక్కదారి పట్టడంతో సీఎం సీరియస్అయ్యారు. పూర్తిస్థాయిలో వ్యవస్థ ప్రక్షాళన చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతా పక్కా పథకం ప్రకారమే..
ఈ వేతన దోపిడీ అంతా పక్కా పథకం ప్రకారమే జరుగుతున్నట్లు స్పష్టమవుతున్నాయి. వివిధ శాఖల్లో ఉద్యోగుల హాజరు, వేతనాల నిధుల విడుదలకు సంబంధించి పర్యవేక్షణ లోపించడంతో మ్యాన్యువల్ అటెండెన్స్ విధానాన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఒకే జిల్లాలో లేదా రెండు వేర్వేరు శాఖల్లో విధులకు హాజరుకాకుండానే తమ పేర్లను నమోదు చేయించి, నెలకు వేల రూపాయల చొప్పున రెండేసి జీతాలను దర్జాగా డిపాజిట్ చేయించుకుంటూ వచ్చారు.
కాగా, ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసి డిజిటల్ వెరిఫికేషన్ చేపట్టిన వెంటనే ఈ అక్రమార్కుల దోపిడీ బయటపడటంతో ఆర్థికశాఖ అధికారులు విస్తుపోతున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ చేపట్టిన ఈ సమగ్ర ఆధార్ ఆడిట్ ప్రక్రియతో అక్రమార్కులు, వారికి సహకరించిన ఏజెన్సీల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో తమ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని, తమ ఉద్యోగాలకు ఎసరు తెస్తుందోననే భయంతో పలువురు రంగలోకి దిగారు. ఈ వ్యవహారాన్ని రట్టు చేయకుండా ఆపాలని, లేదా దీనిని కేవలం "సాంకేతిక లోపం"గా చూపించి తప్పించేలా అధికారులపై పొలిటికల్ ప్రెజర్ తెస్తున్నట్లు సెక్రటేరియెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ స్కామ్ తీవ్రతను గ్రహించిన సీఎం రేవంత్‌రెడ్డి.. సమగ్ర విచారణకు ఆదేశించడంతో రెండు చోట్ల జీతాలు డ్రా చేసిన అక్రమార్కులపై క్రిమినల్కేసులు నమోదు చేశారు.
ఉన్నతాధికారుల అండ ఉందనే అనుమానం..
వాస్తవానికి 4–5 నెలల కిందటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డేటా అస్త్యవస్తంగా ఉంది. ఇది గ్రహించిన సర్కారు వెంటనే ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమాచారాన్ని పూర్తిగా ఆన్లైన్ చేయాలని అధికారులను ఆదేశించింది. ఆయా శాఖల సాంక్షన్డ్ స్ర్టెంథ్ ఎంత? ఎంతమంది పనిచేస్తున్నారు? ఖాళీల వివరాలు ఏమిటి ? ఉద్యోగుల ఆధార్ నెంబర్ తో అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా ఔట్ సోర్సింగ్ఉద్యోగులకు సంబంధించిన వివరాలు కూడా సేకరించారు.
ఇందులో అసలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారీతన ఔట్ సోర్సింగ్ఉద్యోగులను నియమించుకున్నట్లు గుర్తించారు. ఇలాంటి వారు 45 వేల మందికి పైగా ఉన్నట్లు తేల్చారు. పైగా ఐఏఎస్అధికారులు కొందరు బినామీల పేరుతో ఏజెన్సీలు ఏర్పాటు చేసి.. ఔట్ సోర్సింగ్ఉద్యోగ నియమాకాలు చేపట్టినట్లు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. వీటితోపాటు గతంలో ఉన్న ఉన్నతాధికారులు కొన్ని ఏజెన్సీలకు వత్తాసు పలకడంతోనే అక్రమ నియమకాలతో పాటు అక్రమ జీతాల చెల్లింపులు జరిగినట్లు అనుమానిస్తున్నారు.
