కోరుట్ల, మెట్పల్లిలో మూతబడ్డ.. కొన్ని పెట్రోల్ బంకులు.. పెట్రోల్ కోసం మిగతా బంకుల ముందు జనం బారులు

కోరుట్ల, మెట్పల్లిలో మూతబడ్డ.. కొన్ని పెట్రోల్ బంకులు.. పెట్రోల్ కోసం మిగతా బంకుల ముందు జనం బారులు

జగిత్యాల: కోరుట్ల, మెట్ పల్లి పట్టణాలలో పెట్రోల్, డీజిల్ కొరతతో కొన్ని పెట్రోల్ బంకులు మూతబడ్డాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాలపై తీవ్రంగా ఉండటంతో బంకులకు పెట్రోల్ డీజిల్ సప్లైలో అంతరాయం ఏర్పడింది. కొన్ని బంకులు మూతపడడంతో మిగతా బంకులలో పెట్రోల్, డీజిల్ పోయించుకోవడానికి జనం క్యూ కట్టారు.

బంకులు అన్నీ మూతపడతాయనే భయంతో పెద్ద సంఖ్యలో పెట్రోల్, డీజిల్ను జనాలు కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపించింది. రేపటి (మార్చి 11, 2026) వరకు డీజిల్, పెట్రోల్ సప్లై అవుతుందని బంకు యజమానులు తెలిపారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడతుందని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లతో జనం బెంబేలెత్తున్నారు.

ధరలు పెరుగనున్నాయని వార్తలు రావడంతో హైదరాబాద్‌‌లోని ప్రధాన పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. వెహికల్స్లో ఫుల్ ట్యాంక్‌‌లు నింపుతూ, ప్లాస్టిక్ బాటిళ్లు, క్యాన్లలో కూడా పెట్రోల్ తీసుకెళ్తున్నారు.

క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడుతుందన్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. భారత్‌‌కు సరిపడా చమురు నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, ప్రస్తుతానికి రిటైల్ ధరలు పెరగవని,  రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని పేర్కొంది.