హైదరాబాద్ సిటీలోని కాప్రా సర్కిల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం (మార్చి 11) సౌత్ కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. గమనించిన అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో పూర్తిగా మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు 8 లక్షలు రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనాకు వచ్చారు.
అసోసియేషన్ సభ్యుల వివరాల ప్రకారం 12 గంటల వరకు ఇక్కడే ఉన్నామని.. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేసరికి ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదంపై విచారణ జరిపి ఎవరిదైనా ప్రమేయం ఉంటే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
