Lulu Mall : హైదరాబాద్‍లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం.. నిర్వాహకులపై కేసు నమోదు!

Lulu Mall : హైదరాబాద్‍లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం.. నిర్వాహకులపై కేసు నమోదు!

హైదరాబాద్‌లోని లూలూ మాల్ లో  జరిగిన ‘ది రాజాసాబ్’  మూవీ ఈవెంట్ తీవ్ర దుమారం రేపుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న  ఈ భారీ చిత్రంలో సాంగ్ లాంచ్ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  హీరోయిన అభిమానుల తాకిడికి గురవ్వడం, ఆపై పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగింది?

బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని  ప్రముఖ లూలూ మాల్‌లో 'ది రాజా సాబ్' చిత్రంలోని  ‘సహన సహన’ పాటను విడుదల చేసేందుకు చిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఈవెంట్ కు  ఈ ఈవెంట్‌కు నిధి అగర్వాల్, రిధి కుమార్, దర్శకుడు మారుతి హాజరయ్యారు. ప్రభాస్ సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. మాల్‌లోని అంతస్తులన్నీ జనంతో కిక్కిరిసిపోయయాయి.

కార్యక్రమం ముగిసిన తర్వాత నిధి అగర్వాల్ తిరిగి వెళ్తున్న సమయంలో పరిస్థితి అదుపు తప్పింది. సెక్యూరిటీని దాటుకుని వందలాది మంది అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం, ఆమెను తాకేందుకు జనం ఎగబడటంతో నిధి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో నిధి భయం భయంగా, ఉక్కిరిబిక్కిరి అవుతూ కన్పించడం అభిమానులను కలిచివేస్తోంది. చివరకు సెక్యూరిటీ సిబ్బంది అతికష్టం మీద ఆమెను కారు వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది.

పోలీసుల సీరియస్ యాక్షన్

ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కేపీహెచ్‌బీ పోలీసులు.. మాల్ యాజమాన్యంపై , ఈవెంట్ ఆర్గనైజర్లపై కేసు నమోదు చేశారు. ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చే కార్యక్రమానికి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు వెల్లడించారు.  సెలబ్రిటీల రక్షణ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, క్రౌడ్ మేనేజ్‌మెంట్ సరిగా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని పోలీసులు పేర్కొన్నారు.

వైరల్ అవుతున్న దృశ్యాలు

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. "సెలబ్రిటీల భద్రత గాలికి వదిలేస్తారా?" అని నెటిజన్లు నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. నిధి అగర్వాల్ ముఖంలో కనిపించిన ఆందోళన ఆమె అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. గతంలోనూ ఇలాంటి తొక్కిసలాటలు జరిగిన దాఖలాలు ఉండటంతో, పోలీసులు ఈసారి కఠిన చర్యలకు ఉపక్రమించారు. సినిమా ప్రమోషన్ల కోసం క్రేజ్ పెంచుకోవాలనే తాపత్రయంలో సెలబ్రిటీల , సామాన్య ప్రజల భద్రతను విస్మరించడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.