కుత్బుల్లాపూర్: హైదరాబాద్లో బంగారం కోసం ఒక పెద్దావిడను ఆమె ఇంట్లో పనిచేసే పని మనిషి చంపేసింది. దుండిగల్ పోలీస్ స్టేషన్లో కుత్బుల్లాపూర్ ఏసీపీ శంకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సోమవారం చర్చి గాగిల్లాపూర్లో సుశీల(85) అనే వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
సుశీలమ్మ ఇంట్లో పని చేసే పని మనిషి కవిత(36) సుశీల ఒంటిపై ఉన్న (కమ్మలు,రింగ్) బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి సుశీలమ్మ తలపై బండ రాయితో బాది హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బంగారంతో పాటు మృతురాలి సెల్ ఫోన్ను కూడా నిందితురాలు కవిత తీసుకుని పారిపోయింది. సీసీ కెమెరాలు ఆధారంగా నిందితురాలి జాడ తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
గాగిల్లాపూర్ కు చెందిన చిన్నబాటి సుశీలమ్మకు ముగ్గురు కొడుకులు. వారు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. భర్త రాయన్న మృతి తర్వాత ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. సోమవారం మధ్యాహ్నం ఆమెను పనిమనిషి దారుణంగా హత్య చేసి బంగారం చోరీ చేసి పారిపోయింది.
