Jabardasth Comedian: రోడ్డు ప్రమాదంలో ‘జబర్దస్త్’ కమెడియన్ మృతి : కన్నీళ్లు పెట్టుకున్న సుమ

Jabardasth Comedian: రోడ్డు ప్రమాదంలో ‘జబర్దస్త్’ కమెడియన్ మృతి : కన్నీళ్లు పెట్టుకున్న సుమ

రాజమండ్రి–కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో ప్రముఖ ‘జబర్దస్త్’ కమెడియన్ లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ మృతి చెందారు. అలాగే ఆయనతో పాటు అక్షయ్ కుమార్, సత్యకుమార్ అనే మరో ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సీఐ విశ్వం తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం (2026 ఫిబ్రవరి 2) రాత్రి కొవ్వూరుకు చెందిన ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై రాజమండ్రిలో సినిమా చూసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదే సమయంలో రాజమండ్రి క్వారీ మార్కెట్‌కు చెందిన బాబీ తన మోటార్‌సైకిల్‌పై ఎదురుగా రావడంతో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బాబీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు.

కమెడియన్ బాబీ..: తెలుగు బుల్లితెరపై ‘జబర్దస్త్’,‘శ్రీదేవి డ్రామా కంపెనీ’తో పాటు యాంకర్ సుమ నిర్వహిస్తున్న‘సుమ అడ్డా’ఎంటర్‌టైన్‌మెంట్ వంటి పాపులర్ షోల ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల సినీ, టెలివిజన్ రంగాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ప్రమాద వార్త వెలువడిన వెంటనే పలువురు జబర్దస్త్ కమెడియన్లు నవీన్, ఇతర సహచరులు సోషల్ మీడియా వేదికగా ‘మిస్ యూ బాబీ’ అంటూ పోస్టులు పెడుతూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ నుంచి హుటాహుటిన రాజమండ్రికి చేరుకున్న యాంకర్ సుమ, బాబీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వించే బాబీని అలా విగతజీవిగా చూడటంతో ఆమె కంటతడి పెట్టారు. అనంతరం బాబీ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ప్రమాదానికి కొద్ది రోజుల ముందే బాబీ టెలివిజన్ ఇంటర్వ్యూలో పాల్గొనడం విశేషం కాగా, ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకోవడంతో టెలివిజన్ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.