T20 World Cup 2026: ఎంత పటిష్టంగా ఉన్నా అదొక్కటే టీమిండియాకు పెద్ద ముప్పు: సూర్య సేనకు ధోనీ ముందు జాగ్రత్త

T20 World Cup 2026: ఎంత పటిష్టంగా ఉన్నా అదొక్కటే టీమిండియాకు పెద్ద ముప్పు: సూర్య సేనకు ధోనీ ముందు జాగ్రత్త

2026 టీ20 వరల్డ్ కప్  హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. సూపర్ ఫామ్ లో ఉండడం.. సొంతగడ్డపై మ్యాచ్ లు కావడంతో మన జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందని ఫ్యాన్స్ అంచనాలు పెట్టేసుకున్నారు. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ కు ఇండియాతో పాటు శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తుంది. నెల రోజుల పాటు ధనాధన్ బ్యాటింగ్ తో క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇవ్వనున్నాయి. ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు ఆడుతుండడంతో భారీ హైప్ నెలకొంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. వరల్డ్ కప్ ముందు టీమిండియాకు అతి పెద్ద ముప్పు ఏంటో మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పుకొచ్చాడు.  

ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ధోనీ డ్యూ ఫ్యాక్టర్ టీమిండియాకు అతి పెద్ద ముప్పు అని తెలిపాడు. తాను టీమిండియాకు ఆడుతున్నప్పుడు మంచు చాల చిరాకు తెప్పించేదని.. అది తనకు ఇష్టం ఉండదని మహేంద్రుడు చెప్పుకొచ్చాడు. టాస్ గెలవడం చాలా కీలకంగా మారుతుందని.. బలమైన ప్రత్యర్థితో ఆడుతున్నపుడు కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవని మిస్టర్ కూల్ తన అనుభవాలను పంచుకున్నాడు. తనకు డ్యూ ఫ్యాక్టర్ అంటే అసలు నచ్చదని.. ప్రస్తుతం భారత జట్టు అత్యంత ప్రమాదకరంగా ఉందని ధోనీ చెప్పాడు. మన జట్టుకు చాలా అనుభవం ఉందని.. ముఖ్యంగా ఒత్తిడిలో ఆడే ప్లేయర్స్ మన జట్టులో ఉన్నారని సూర్య సేన గురించి ఎంఎస్డీ అన్నారు.
    
2024లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత భారత జట్టు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఏదైనా..వరుసగా సిరీస్ విజయాలు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత జట్టు సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకుంటుందని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ విధ్వంసానికి మారు పేరులా మారారు. సూర్య తన టాప్ ఫామ్ అందుకోవడం టీమిండియాకు కొండంత బలం. మిడిల్ ఆర్డర్ లో దుమ్ములేపడానికి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, రింకూ సింగ్ సిద్ధంగా  ఉన్నారు. బౌలింగ్ లో కూడా డీసెంట్ గా కనిపిస్తుంది. మరి అంచనాలకు తగ్గటుగా ఆడి భారత జట్టు టీ20 వరల్డ్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.