ఆవు మూత్రం తాగితే క్యాన్సర్ నయమవుతుందా..? క్రికెటర్ సిద్ధూ భార్య స్టేట్మెంట్పై డాక్టర్లు ఏమంటున్నారంటే..

ఆవు మూత్రం తాగితే క్యాన్సర్ నయమవుతుందా..? క్రికెటర్ సిద్ధూ భార్య స్టేట్మెంట్పై డాక్టర్లు ఏమంటున్నారంటే..

ఇండియన్ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ భార్య క్యాన్సర్ విషయంలో చేసిన స్టేట్మెంట్ పెద్ద దుమారమే రేపుతోంది. విశ్వాసాలకు, సైన్స్ కు మధ్య పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆమె చేసిన వ్యాఖ్యలతో ఏకంగా డాక్టర్లే ముందుకు వచ్చి ఖండించడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాతో పాటు హెల్త్, పొలిటికల్ తదితర సర్కిల్స్ లో ఇంతటి వివాదం రేగటానికి ఆమె చేసిన వ్యాఖ్యలేంటి..? డాక్టర్లు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారో చూద్దాం.

2025  జనవరి 31న సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్యాన్సర్ ట్రీట్ మెంట్ లో భాగంగా అల్లోపతీ ట్రీట్ మెంట్ తో పాటు ఆవు మూత్రం తాగడం, ప్రత్యేకమైన డైట్ పాటించడంతోనే తనకు వ్యాధి నయమైనట్లు పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కోలుకున్న ఆమె చేసిన స్టేట్ మెంట్ దేశమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సీరియస్ చర్చకు దారితీసింది. ఈ స్టేట్ మెంట్ పై డాక్టర్లు (ఆంకాలజిస్టులు) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె మళ్లీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. 

చెప్పిందేంటి.. క్లారిఫికేషన్ ఏంటి..?

ఆచార్య అనిరుద్ధాచార్య ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. నవజోత్ కౌర్ సిద్ధు తన క్యాన్సర్ జర్నీ గురించి చెబుతూ.. క్యాన్సర్ ట్రీట్ మెంట్ సమయంలో  తను రెగ్యులర్ గా గోమూత్రం తాగేదాన్నని.. స్నానం కూడా చేసేదాన్నని చెప్పారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఘోరమైన విమర్శలు వచ్చేసరికి మంగళవారం ( ఫిబ్రవరి 03) ఎక్స్ లో క్లారిఫికేషన్ తో కూడిన ట్వీట్ చేశారు. తన ఉద్దేశం అధునాతన చికిత్సలు, మెడిసిన్ ను వాడొద్దని కాదని పేర్కొన్నారు. 

పూర్తి వీడియో చూడండి. క్యాన్సర్ వచ్చిన తర్వాత అల్లోపతి చికిత్స ఒక్కటే మార్గం. ప్రజలకు సహాయపడే చికిత్సలకు మద్దతు ఇవ్వడం గురించి అరగంట పాటు వీడియోలో మాట్లాడాను. చక్కెర, రిఫైన్డ్ ఆయిల్స్ (శుద్ధి చేసిన నూనెలు), ఎసిడిటీ పెంచే పదార్థాలు, ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహార పదార్థాలు, ధాన్యాలు, పాల ఉత్పత్తులు, పురుగుమందులు ఉపయోగించిన ఆహారం మొదలైనవి తీసుకుంటూ ఉంటే మీ అనారోగ్యాన్ని మీరు ఎప్పటికీ నయం చేయలేరు. లైఫ్ స్టైల్ లో మార్పులు , మీరు తినే ఆహారం మీ వ్యాధి తగ్గేందుకు కొంత సహకరిస్తాయి.  మీ ఆంకాలజిస్ట్ సజ్జెస్ట్ చేసే ట్రీట్ మెంటే చాలా ముఖ్యం.  హాఫ్ నాలెడ్జ్ తో ఏం చేసిన ప్రమాదం.. అందుకే నేను చెప్పిన ఫుల్ రీల్ చూడండి.. అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

ఇదే విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశారు.  క్యాన్సర్ నిపుణుడి ద్వారా అల్లోపతి చికిత్స మాత్రమే మీ ప్రాణాన్ని కాపాడుతుంది. జీవనశైలి మార్పులు, పురుగుమందులు లేని సేంద్రీయ ఆహారాలు, ధాన్యాలు లేదా పాల ఉత్పత్తులు లేనివి, గోమూత్ర చికిత్సలు వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు సహాయక చికిత్సగా పనిచేస్తాయి కానీ  ఎప్పటికీ వ్యాధిని నయంచేయలేవు. డాక్టర్ రూపిందర్ బాత్రా వంటి మంచి వైద్యుడి ద్వారా నాకు అందిన తక్షణ చికిత్స కారణంగా నేను కోలుకున్నాను. అలాంటి చికిత్స క్యాన్సర్ రోగికి ముందుకు సాగడానికి ఏకైక మార్గం. శస్త్రచికిత్స, కీమోథెరపీ , రేడియేషన్ నా ప్రాణాన్ని కాపాడాయి. నేను త్వరగా నయం కావడానికి ఆహారం, లైఫ్ స్టైల్ (జీవనశైలి) మార్పులు ఉపయోగపడ్డాయి. ఇప్పటికీ కొనసాగిస్తున్నాను.. అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 

డాక్టర్స్ ఏమన్నారు..?

నవజోత్ కౌర్ సిద్ధూ స్టేట్మెంట్ పై డాక్టర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవు మూత్రం సపోర్టివ్ థెరపీ లాగా ఉపయోగపడినట్లు ఆమె చేసిన వ్యాఖ్యలు పేషెంట్స్ ను మిస్ లీడ్ చేస్తాయని హెచ్చరించారు. బెంగళూరులోని ఆస్టర్ సీపీఐ హాస్పిటల్ కు చెందిన ఆంకాలజీ బ్రెస్ట్ క్యాన్సర్ డిపార్ట్ మెంట్ హెడ్.. డా.పూవమ్మ ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. 

గోమూత్రం రొమ్ము క్యాన్సర్ లేదా మరే ఇతర క్యాన్సర్‌ను నయం చేస్తుందని చూపించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు చెబుతున్నది ఇదే. ప్రజా ప్రతినిధులు ఇలాంటి అశాస్త్రీయ వ్యాఖ్యలు చేసినప్పుడు రోగులు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే క్యాన్సర్ బారిన పడిన రోగులు, కుటుంబాలను గందరగోళానికి గురి చేస్తుంది. ఎక్కడా నిరూపితం కాని కట్టుకథలను చెప్పడం ద్వారా ఇది ప్రయత్నించాలని కొందరు భావిస్తారు. కొందరు డాక్టర్లపైన కూడా ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఇలాంటి మార్గాలను ఎంచుకుంటే క్యాన్సర్ మహమ్మారి నుంచి కోలుకోవడం కష్టకమవుతందని అన్నారు. నమ్మకం, పోషకాహారం కొంత మేరకు సపోర్టివ్ గా ఉంటాయి కానీ.. కీమోతెరపీ, రేడియేషన్, సర్జరీలను రీప్లేస్ చేయలేవు అని అన్నారు. 

ఇలాంటి నమ్మకాలతో చాలా ప్రమాదం:

ముంబైకి చెందిన ఫోర్టిస్ హీరానందని హాస్పిటల్ ఆంకాలజిస్ట్ డా.శిశిర్ షెట్టీ సిద్ధూ వ్యాఖ్యలను పూర్తిగా కొట్టిపారేశారు. ఇలాంటి నమ్మకాలు, పుకార్లు చాలా డేంజర్ గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సైంటిఫికల్ గా ప్రూవ్ అయిన ట్రీట్ మెంట్ కాదని పేషెంట్స్ ఇలాంటి మార్గాలను ఎంచుకుని డేంజర్ లో పడే ప్రమాదం ఉందని అన్నారు. 

ట్రీట్ మెంట్ సమయంలో వాడే సంప్రదాయ పద్ధతులు, నమ్మకాలు కూడా ప్రమాదకరమని ఆయన అన్నారు. వీటి ద్వారా ఏదో అద్భుతం జరుగుతుందని పేషెంట్స్ ఫాలో అయితే.. ఆ తర్వాత కోలుకోలేని ప్రమాదంలో పడిపోతారని.. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని.. నిర్ధారణ కాని నమ్మకాలను నాయకులు, సెలబ్రిటీలు ప్రచారం చేసి ప్రజల ప్రాణాలను రిస్క్ లో పెట్టవద్దని సూచించారు.