ఇండోర్: న్యాయం పొందే హక్కు ప్రజలందరికీ లభించాలంటే సంభాషణ, ఆత్మగౌరవం, భాగస్వామ్యాలు అత్యంత కీలకమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ స్పష్టం చేశారు. నిజమైన ఉచిత న్యాయ సహాయం అంటే బాధితులకు సూచనలు ఇవ్వడం మాత్రమే కాదని, వారి సమస్యలను ఓపికగా వినడమని ఆయన చెప్పారు.
శనివారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిర్వహించిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నాల్సా) వెస్టర్న్ జోన్ ప్రాంతీయ సదస్సులో ముఖ్య అతిథిగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. వ్యవస్థల లక్ష్యం కేవలం కేసుల పరిష్కారం మాత్రమే కాదని, న్యాయం కోసం వచ్చే ప్రతీ ఒక్కరికీ గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడ మని అన్నారు.
‘‘కేసులు తగ్గించడం ఎంత ముఖ్యమో, బాధితుడి ఆత్మగౌరవం కాపాడ టం కూడా అంతే ముఖ్యం. గిరిజనులు, మత్స్యకారులు, వలస కార్మికుల సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా న్యాయ పరిష్కారాలుండాలి” అని చెప్పారు.
