- డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక
రాంచీ: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ) పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్టూడెంట్ల ఆందోళన 15వ రోజుకు చేరడంతో సర్కారు దిగివచ్చి చర్చలు చేపట్టినప్పటికీ, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని విరమించేది లేదని విద్యార్థి సంఘాలు తేల్చిచెప్పాయి. వివిధ డిపార్ట్‌మెంట్లకు చెందిన మంత్రులతో కూడిన ఐదుగురు సభ్యుల ప్రభుత్వ కమిటీ.. నిరసన తెలుపుతున్న విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరిపింది. ఏడు రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా (జేఎల్‌కేఎమ్) నాయకుడు దేవేంద్రనాథ్ మహతో బృందంతో పాటు జేసీఎమ్, ఎన్ఎస్‌యూఐ, ఎస్‌సీఎస్ సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది.
సీఎం దృష్టికి తీసుకెళ్తాం.
అక్రమాలు జరిగిన14వ జేపీఎస్‌సీ పరీక్షలతో పాటు వివాదాస్పదమైన ఇతర నియామక పరీక్షలన్నింటినీ వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశా రు. ఈ లీకేజీ వ్యవహారంపై సీబీఐ లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల కమిటీతో స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. అలాగే అనుమానాస్పదంగా ఉన్న జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ పరీక్షలపై 90 రోజుల్లోగా సీఐడీ విచారణ పూర్తి చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తరహాలోనే ‘జార్ఖండ్ టెస్టింగ్ ఏజెన్సీ’ (జేటీఏ)ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నియామక పరీక్షల్లో గిరిజన, ప్రాంతీయ భాషలను అర్హత పేపర్లుగా చేర్చాలని జేసీఎమ్, ఎన్ఎస్‌యూఐ ప్రతినిధులు కోరారు. విద్యార్థుల డిమాండ్లు సమంజసమైనవని, వీటిని సీఎం హేమంత్ సోరెన్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ తెలిపారు. అలాగే నియామక ప్రక్రియలో సంస్కరణల కోసం ప్రభుత్వం ఇచ్చిన ఈమెయిల్‌కు సూచలను పంపవచ్చని మంత్రి సుదివ్య కుమార్ వెల్లడించారు.
