న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి దిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ అంశంపై ఇరువురు నేతల మాటల యుద్ధం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. శుక్రవారం జరిగిన ‘ఆస్క్ మీ ఎన్టీంగ్’ సెషన్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘దేశంలో మహిళల శక్తిని బందీ చేశారు. సొంతింట్లో కూడా మహిళలు తమను తాము వ్యక్తపరచుకునే అవకాశం దొరకట్లేదు.
మహిళలు తమను తాము వ్యక్తపరచుకోలేని ఏ దేశమూ విజయం సాధించలేదు. మహిళలు గళం విప్పకపోవడం వల్లే మన దేశం కుంటుపడిపోయింది. మన విద్యా వ్యవస్థలో యువతులకు పూర్తి స్థాయి సమాన అవకాశాలు, రక్షణ కల్పించడంలో లోపాలున్నాయి. వారి పట్ల వివక్ష, భద్రతా సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉద్యోగ, వృత్తిపరమైన కార్పొరేట్ రంగాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కడం లేదు.
సమాజంలోనూ సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, భయం లేకుండా తిరిగే వాతావరణం ఇంకా మహిళలకు పూర్తిగా రాలేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
రాహుల్ మనసు మారినట్లుందే..!!
రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్టకేలకు సానుకూల స్పందన వచ్చినట్లుందని.. మహిళలపై రాహుల్ గాంధీ మనసు మారినట్లు కన్పిస్తోందని ఎద్దేవా చేశారు. అలాగే, మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రిజిజు వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్న మీకు.. కాంగ్రెస్ మద్దతుతోనే మహిళా రిజర్వేషన్ బిల్లు-2023 ఆమోదం పొందిందన్న విషయం బాగా తెలుసని రాహుల్ అన్నారు. మూడేళ్లుగా దీనిని ఎందుకు అమలు చేయట్లేదని, దీనిని డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారని నిలదీశారు.
తాజా సెన్సస్ గణాంకాలు అవసరమే..
దీనికి వివరణ ఇస్తూ.. 2023 చట్టం ప్రకారం.. 2026 తర్వాత ప్రచురితమయ్యే జనాభా లెక్కలు ఆధారంగా డీలిమిటేషన్ జరగాల్సి ఉంటుందని రిజిజు చెప్పారు. కులగణన కారణంగా ఇది ఆలస్యం అయితే మహిళా రిజర్వేషన్లు 2034 దాకా వాయిదా పడే అవకాశం ఉందని తెలిపారు. అందుకే 2029లో జరిగే తదుపరి సాధారణ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి.. అందుబాటులో ఉన్న తాజా సెన్సస్ గణాంకాలు అవసరమని వివరించారు.
