ఆగస్టు 14 నుంచి దేవాదుల నీళ్లు విడుదల: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఆగస్టు 14 నుంచి దేవాదుల నీళ్లు విడుదల: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్ ఘనపూర్, వెలుగు: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎండిపోతున్న ఆరుతడి పంటలను కాపాడేందుకు ఆగస్టు 14 నుంచి దేవాదుల రిజర్వాయర్ల నుంచి సాగునీరు విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. శనివారం ఆయన స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ కుడి కాలువను నీటిపారుదల, మున్సిపల్​ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు. ఘనపూర్ రిజర్వాయర్ కింద సుమారు 2,500 ఎకరాల ఆయకట్టు ఉందని, కాలువల ఆధునికీకరణ లేకపోవడంతో చివరి ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదన్నారు.

రెండు పంటలకు సాగునీరు అందించేలా శాశ్వత కాలువల నిర్మాణానికి మూడు నెలల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. కాలువల్లో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు వెంటనే చేపట్టాలన్నారు. మున్సిపల్ మురుగు నీరు కాలువల్లో కలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల 14 నుంచి 15 రోజుల పాటు ధర్మసాగర్, స్టేషన్ ఘనపూర్, అశ్వరావుపల్లి, గండి రామారం, నవాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట రిజర్వాయర్ల నుంచి ‘ఆన్ అండ్ ఆఫ్’ పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని తెలిపారు. రైతులు ఈ నీటిని ఆరుతడి పంటలకు వినియోగించుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, నీటి పారుదల శాఖ ఎస్ఈ సీతారాం తదితరులున్నారు. 

‘చేయూత’కు దరఖాస్తు చేసుకోవాలి

ధర్మసాగర్​: ధర్మసాగర్ మండలం ముప్పారంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణపై నిర్వహించిన గ్రామసభలో స్టేషన్ ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని, దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు. దరఖాస్తు విధానం, అవసరమైన ధ్రువపత్రాలపై సర్పంచ్ గుంటిపల్లి రేణుక, గ్రామ నాయకులతో చర్చించారు. అనంతరం ఇటీవల మృతిచెందిన గ్రామ ఉప సర్పంచ్ తాళ్లపెల్లి కుమారస్వామి తల్లి వరమ్మ, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీ డాక్టర్ శ్రీరాముల వెంకటేశ్వర్లు తల్లి కుటుంబాలను పరామర్శించారు.