ఐఏఎఫ్‌‌ అధికారి హనీట్రాప్.. పోలీసుల అదుపులో వింగ్ కమాండర్

ఐఏఎఫ్‌‌ అధికారి హనీట్రాప్.. పోలీసుల అదుపులో వింగ్ కమాండర్
  •     పాక్ హ్యాండర్లకు సున్నితమైన సమాచారం చేరవేత 

న్యూఢిల్లీ: భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్ హ్యాండర్లకు చేరవేస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలతో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఒక వింగ్ కమాండర్‌‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, ఆయనను ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వింగ్ కమాండర్ తన వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సోషల్ మీడియాలో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. 

ఆ పరిచయం క్రమంగా చాటింగ్, వీడియో కాల్స్‌‌ వరకు వెళ్లింది. అధికారి నమ్మకాన్ని పూర్తిస్థాయిలో చూరగొన్న ఆ మహిళ,  ఆ తర్వాత రక్షణ దళాలకు చెందిన రహస్య సమాచారాన్ని సేకరించడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే సైనిక దళాల కదలికలు, రక్షణ స్థావరాల మోహరింపు వివరాలు, వ్యూహాత్మక పత్రాల ఫొటోలు, వీడియోలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ఆ మహిళకు సదరు అధికారి అందజేశారు. ఆ మహిళ ఆ సమాచారాన్ని పాక్ హ్యాండ్లర్లకు చేరవేసినట్లు విచారణలో తేలింది. అంతే కాకుండా, ఆమె ఆదేశాల మేరకు తన సహోద్యోగి మొబైల్ ఫోన్‌‌లో ఒక ప్రత్యేకమైన యాప్‌‌ను ఇన్‌‌స్టాల్ చేసేందుకు కూడా వింగ్ కమాండర్ ప్రయత్నించినట్టు అధికారులు గుర్తించారు. ఐఏఎఫ్ నిఘా విభాగం ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు అధికారిని అదుపులోకి తీసుకున్నారు.