లాల్ దర్వాజ బోనాలు.. బంగారుబోనం, పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు పొన్నం, సురేఖ

లాల్ దర్వాజ బోనాలు.. బంగారుబోనం, పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు పొన్నం, సురేఖ

లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ వేడుకల్లో భాగంగా.. అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,  రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఘనంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది బోనాల పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 20 కోట్లు కేటాయించిందని, ఆషాఢ మాసం బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. ఎల్ నీనో  ప్రభావం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసి బోనాల పండుగను విజయవంతం చేశామని, భవిష్యత్తులో ఓల్డ్ సిటీ సింహవాహిని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.