ఫుకెట్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగానే కుదుపులకు గురై అకస్మాత్తుగా 300 మీటర్లు ఎత్తు కిందకు దిగిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు పైలట్లకు డోపింగ్ టెస్టు నిర్వహించగా వారిలో ఒకరు టెస్ట్ ఫెయిల్ అయ్యారు. దీంతో ఇద్దరు పైలట్లను డీజీసీఐ సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు వీరిని విధులనుంచి ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి.
పౌరవిమానయాన శాఖ రూల్స్ ప్రకారం.. సాధారణంగా విమాన ప్రయాణం అనంతరం పైలట్లకు డోపింగ్ టెస్టులు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఘటన తర్వాత ఎయిర్ ఇండియా సిబ్బందికి నిర్వహించిన డోపింగ్ టెస్టులో పైలట్లలో ఒకరు ఫెయిల్ అయినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.
ఆగస్టు 5న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా A320 విమానం AI2379 ప్రయాణంలో గాల్లో ఉండగానే తీవ్రమైన కుదుపులకు గురైంది. సుమారు ఐదు నిమిషాల పాటు కుదుపులు కొనసాగడంతో ఒకరిపై పడి 17 మంది ప్రయాణికులు గాయాపడ్డారు. విమానంలో ఉన్న సిబ్బందికి గాయాలయ్యాయి. ఘటన సమయంలో విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే తిరిగి విమానం అదుపులోకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు చేపట్టింది.
