ఆధునిక సాహిత్యంలో ‘కోటి రత్నాల వీణ’ శ్రుతిలో కణకణ మండే అగ్ని గీతాలు ఆలపిస్తున్న ప్రజా కవి డాక్టర్ నందిని సిధారెడ్డి. సామాజిక విముక్తి ఉద్యమాల దారుల్లో సాహిత్య మహానదిలా పరవళ్ళు తొక్కుతున్న అపురూప సృజనకారుడు ఆయన. కవిగా, పాటల రచయితగా, కథకుడిగా, నవలాకారుడిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా వర్తమాన తెలుగు సాహిత్యాన్ని సంపద్వంతం చేస్తున్నాడు.
తెలంగాణ సాయుధ పోరాట కార్యకర్త, తండ్రి బాలసిధారెడ్డి ధిక్కార నైజాన్ని,‘ఎత ఎవలిదైనా విని కరిగి కన్నీళ్లు పెట్టుకునే’ తల్లి రత్నవ్వ కారుణ్య తత్త్వాన్ని అందిపుచ్చుకొని, జన్మభూమి బందారం సమకూర్చిన మౌలిక సంస్కారంతో, విప్లవోద్యమ చైతన్యంతో సిధారెడ్డి కవిగా అవతరించాడు. ‘వరిమొవ్వకు తీపి బువ్వ తినిపించే మంజీర నదిలా’ తెలంగాణ ఈస్థటిక్స్తో తెలుగు కవిత్వానికి కొత్త సొబగులు దిద్దాడు. ‘‘వెన్నెల్ని నా గీతానికి శిల్పంగా మలుచుకుంటాను /వెక్కి వెక్కి ఏడుస్తున్న సముద్రాలను ఓదార్చుతాను” విశాలంగా కదులుతున్న నదులతో ప్రవహిస్తాను (భూమి స్వప్నం) అంటూ తన వస్తు, రూపాలను చాటిచెప్పాడు. ప్రవహించే నదుల వంటి ప్రజా ఉద్యమాలతో ప్రయాణిస్తూ, దుఃఖ సముద్రాల వంటి పీడిత ప్రజల విముక్తిని ప్రబోధిస్తూ కవిత్వం రాస్తానని తన సృజన లక్ష్యాన్ని ప్రకటించాడు. ‘జీవితం పొడవునా అగ్నిని పాడదలుచుకున్నాను/ కన్నీటికి నోరొచ్చినట్లు పాడతాను’’ అని ఉదాత్తంగా వాగ్దానం చేసి, ఇలాంటి సృజన కార్యాచరణతో, సాంద్రతరమైన అభివ్యక్తితో సహజ సిద్ధమైన బతుకు భాషతో తెలుగు వచన కవిత్వంపై సిధారెడ్డి బలమైన ముద్రవేశాడు. ప్రధానంగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి సాంస్కతిక ఆలంబనగా నిలిచాడు. భూమిస్వప్నం, సంభాషణ, ప్రాణహిత, ఒక బాధగాదు, నదిపుట్టువడి, ఇక్కడ చెట్ల గాలి, నీటి మనసు’ వంటి కవితా సంపుటాలే ఇందుకు అక్షర సాక్ష్యం. ప్రారంభంలో కొమరెల్లి మల్లికార్జునస్వామి గురించి శతకం రాసిన సిధారెడ్డి, విప్లవోద్యమ ప్రభావంతో,‘కష్టజీవులను కాంతి దేవుళ్ళు’’గా విశ్వసించి, నిరంతరం కవితారాధన చేశాడు.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన విశిష్ట కావ్యం అనిమేష. కొవిడ్19 నేపథ్యంలో ప్రపంచ దుఃఖాన్ని, అందుకు కారణభూతమైన అంతర్జాతీయ పరిస్థితులను, ఈ అనూహ్య విషాద నివారణకు అవసరమైన వైజ్ఞానిక, నైతిక చైతన్యాన్ని కళాతత్త్వ శోభితంగా కావ్యంలో అందించాడు.
సిధారెడ్డి ‘చిత్రకన్ను’ కథాసంపుటి గురించి పెద్దగా చర్చ జరగలేదుకాని ప్రముఖ కథారచయిత కాట్రగడ్డదయానంద్ ఈ కథలను సముచితంగా విశ్లేషించాడు. మెదక్ జిల్లా ప్రాంతంలో డెబ్బయి, ఎనభయ్యో దశకాల్లోని గ్రామీణ సామాజిక జీవనస్థితిగతులను, భూస్వామ్య, పటేల్, పట్వారీ వ్యవస్థలో వ్యవసాయ కూలీలు , దళితులు ,స్త్రీలు, ఏవిధ మైన దోపిడీకి అమానవీయతకు గురవుతున్నారో అత్యంత సహజంగా చిత్రకన్ను కథల్లో చిత్రించాడు.
తండ్రి బాలసిధారెడ్డి జీవన ప్రస్థానం ఆయన చుట్టూ పెనవేసుకున్న వామపక్ష వాతావరణం, విప్లవ స్ఫృహ, ఊరుమ్మడి బతుకుల తీరు తెన్నులను ‘నాగటితరం’ నవలలో సిధారెడ్డి సజీవంగా అక్షరబద్ధం చేశాడు. ‘‘బట్టొకలిది. జుట్టొకలిది. కుండొకలిది. కూడొకలిది. కూసున్న పీటొకలిది. పడుకునే మంచమొకలిది. ఎవలు లేకపోయినాఎల్లది ఒకరికొకరు అయితేనే ఊరు’’ అందరూ పరస్పర శ్రమైక బంధంతో జీవించాలనే ఎరుకను ఈ నవలలో ఆయన గొప్పగా ఆవిష్కరించాడు. తెలంగాణ భాషా సాహిత్యాల ఔన్నత్యాన్ని, చారిత్రిక, సాంస్కృతిక ప్రాభవాన్ని సోదాహరణంగా నిరూపిస్తూ ఆయన ఇగురం, ఆవర్తనం విమర్శ గ్రంథాలను వెలువరించాడు.
తమ తమ కులవృత్తుల నేపథ్యంలో వెలువడిన విభిన్న కవుల కవితలను సమీక్షిస్తూ సిధారెడ్డి రాసిన ‘కులవృత్తులు తెలంగాణ సాహిత్యం’ అనే లఘు గ్రంథం బహుజన సాహిత్య పరిశోదనకుఆధార గ్రంథంగా ఉపయోగపడుతుంది. సుప్రసిద్ధ తెలుగు కవుల కవితలను వ్యాఖ్యానిస్తూ సిధారెడ్డి రూపొందించిన ‘పదచిత్రం’ (వీడియో సిరీస్) డిజిటల్ తరం పాఠకులకు తెలుగు సాహిత్యం పట్ల సదవగాహన కలిగిస్తుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షునిగా ఆయన తెలంగాణ సాహిత్య వికాసానికి ఆయన ఎంతగానో తోడ్పడ్డాడు. సోయి, మంజీర, జంబి పత్రికల సంపాదకుడిగా, మంజీర రచయితలసంఘం వ్యవస్థాపకునిగా, ఆచార్యునిగా, వక్తగా, సిధారెడ్డి చేసిన కృషి విశేషమైనది. ఒక వటవృక్షంలా కాకుండా, సాహిత్య ఉద్యానవనంలా సిధారెడ్డి విలసిల్లాడు. తోటమాలిలా ఆయన ఎన్నో కొత్త సాహిత్య సుమాలను పూయించాడు.
డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన శిఖరం (నందిని సిధారెడ్డి కవిత్వ జీవన ప్రస్థానం- జాతీయ సదస్సు పత్రాలు), మందారం (సిధారెడ్డి అభినందన సంచిక), ఆచార్య అనుమాండ్లభూమయ్య రాసిన తెలంగాణ నాగేటి చాళ్ళు (సిధారెడ్డి కవితావలోకనం) డాక్టర్ వి.జయప్రకాష్, డాక్టర్ శ్రీభాష్యం అనూరాధ సంపాదకత్వంలో డాక్టర్ నందిని సిధారెడ్డి సాహిత్య సమాలోచన (తెలుగు ఇంగ్లీషు వ్యాస సంకలన) గ్రంథాలు అరుదైన ఆయన సాహిత్య వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. సిధారెడ్డి కవితలు ఆంగ్లం, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఉర్దు భాషల్లోకి అనువాదమయ్యాయి.
మలి దశ తెలంగాణ ఉద్యమంలో మరింత క్రియాశీలకంగా పాల్గొనాలనే లక్ష్యంతో ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తిత్వం సిధారెడ్డికే సొంతం. ఎన్నో అరుదైన పురస్కారాలు స్వీకరించిన ఆయన, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కవితా పురస్కారాన్ని (2001) తిరస్కరించాడు. కోటి రూపాయల నగదు పురస్కారం కంటే ‘కోటి రత్నాలవీణ’ సాంస్కృతిక సంపద, ఆత్మగౌరవం ముఖ్యమని భావించిన సమున్నతసాహితీ శిఖరం సిధారెడ్డి. ‘కరిగితే కవి పారితే నది’ అని ఆయన భాష్యం చెప్పినట్లుగానే ఐదు దశాబ్దాలుగా ద్రవీభవన చిత్తంతో అనుక్షణం కవిగా స్పందిస్తూ, సాహిత్య జీవ నదిలా సిధారెడ్డి ప్రతినిత్యం ప్రవహిస్తూనే ఉన్నాడు.
- ఆచార్య కోయి కోటేశ్వర రావు
తెలుగుశాఖ అధ్యక్షులు,
ప్రభుత్వ సిటీ కళాశాల
