హైదరాబాద్: తప్పుడు రిపోర్టులు ఇచ్చిన వ్యవహారంలో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. బాధితురాలు అనుభవించిన మానసిక వేదనకు, ఆర్థిక నష్టానికి రూ.2.2 లక్షల పరిహారం చెల్లించాలని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులను ఆదేశించింది. అంతేకాదు.. బాధితురాలికి అయిన 20 వేల కోర్టు ఖర్చులను, 17 వందల NT స్కాన్ ఫీజును బాధితురాలికి చెల్లించాలని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కు స్పష్టం చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మార్చి 15, 2024న ఆర్.భార్గవి అనే గర్భిణి మహిళ NT స్కాన్ చేయించుకోవడానికి దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కు వెళ్లింది. ఆమెకు NT స్కాన్ చేసిన విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ సిబ్బంది.. కడుపులో పిండం ఆరోగ్యంగా ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదని.. రిపోర్ట్స్ నార్మల్ ఇచ్చారు.
అయితే.. ఆ తర్వాత సదరు మహిళ గైనకాలజిస్ట్‌ను కలిసింది. ఆ సమయంలో పిండం మెడపై తిత్తి ఉన్నట్లు గైనకాలజిస్ట్కు అనుమానం వచ్చింది. మరోసారి NT స్కాన్ చేయించుకోవాలని గైనకాలజిస్ట్ సూచించింది. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో కాకుండా మరో స్కానింగ్ సెంటర్లో భార్గవి NT స్కాన్ చేయించుకోగా గైనకాలజిస్ట్ అనుమానమే నిజమైంది.
కడుపులోని శిశువు మెడపై 11ఎంఎం సిస్ట్ ఉందని తేలడంతో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఫేక్ రిపోర్ట్ నిర్వాకం బయటపడింది. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ రిపోర్ట్స్ నమ్ముకుని ఉంటే.. ప్రసవం సమయంలో తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం కలిగేదని గైనకాలజిస్ట్ చెప్పారు.
గైనకాలజిస్ట్ సూచన మేరకు గర్భం తీయించుకోవడంతో ప్రమాదం తప్పిందని బాధిత మహిళ అయిన భార్గవి తెలిపింది. తనకు జరిగిన అన్యాయానికి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది.
ఈ కేసులో పూర్వాపరాలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్.. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ తప్పుడు రిపోర్టులు ఇచ్చిందని నిర్ధారించింది. బాధితురాలికి నష్ట పరిహారం, కోర్టు ఖర్చులు, NT స్కాన్ కోసం ఆవిడ నుంచి వసూలు చేసిన 17 వందల రూపాయలతో సహా చెల్లించాలని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఆదేశించింది.
