ఓలా, ఉబెర్, ర్యాపిడో డ్రైవర్లు దేశ వ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 7వ తేదీన దేశ వ్యాప్తంగా స్ట్రైక్ నిర్వహిస్తామని హెచ్చరించారు. తమ శారీరక శ్రమను ఈ ప్లాట్ ఫామ్స్ దోచుకుంటున్నాయని.. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగుతున్నట్లు తెలంగాణ యప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరమ్ (TADF) మంగళవారం (ఫిబ్రవరి 3) ప్రకటించింది.
మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్, 2025 విడుదల చేసినప్పటికీ.. కంపెనీలు ఏకపక్షంగా చార్జీలు నిర్ణయిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. డ్రైవర్ల నుంచి దోపిడీ చేస్తున్నాయని.. దీంతో డ్రైవర్లు నష్టపోతున్నారని.. అప్పులపాలవుతున్నట్లు చెబుతున్నారు. డ్రైవర్ల పరిస్థితులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాని ఖండిస్తున్నట్లు తెలిపారు. కంపెనీల అత్యాశ కారణంగా డ్రైవర్లతో పాటు ప్రయాణికులు కూడా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మినిమమ్ బేస్ చార్జీలు నిర్ణయించడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తున్నారు. ప్లాట్ ఫామ్ లు డ్రైవర్ల ఆదాయాన్ని దోచుకోవడంతో తీవ్రమైన భారం పడుతున్నట్లు చెబుతున్నారు. పెట్రోల్ డీజిల్ ఖర్చులు పెరుగుతుండటం, వెహిల్ మెయింటెనెన్స్ ఖర్చులు, ఇన్సూరెన్స్ తదితర ఖర్చులను డ్రైవర్లపైనే కంపెనీలు వేస్తున్నాయని.. దీంతో పూటగడవటం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మినిమబ్ బేస్ చార్జీలను నిర్ణయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా కంపెనీలు ప్రైవేట్ వాహనాలను వినియోగిస్తూ తమ పొట్టకొడుతున్నాయని దీన్ని నివారించాలని కోరుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాలను వేడుకున్నా లాభం లేకుండా పోయిందని.. అందుకే దేశ వ్యాప్త సమ్మెకు దిగనున్నట్లు TADF యూనియన్ ప్రకటించింది.
గతంలో క్రిస్మస్ (డిసెంబర్ 25), న్యూ ఇయర్ (డిసెంబర్ 31) సందర్భంగా స్ట్రైక్ నిర్వహించారు. హైదరాబాద్ లో మొత్తం 2 లక్షల మంది గిగ్ వర్కర్లలో 50 వేల మంది డిసెంబర్ 31 సమ్మెలో పాల్గొన్నట్లు యూనియన్ ప్రసిడెంట్ తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే మరింత ఉధృతంగా సమ్మె నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా హెచ్చరించారు.
