అమెరికా నుంచి ఐఫోన్, ల్యాప్‌టాప్ తెస్తున్నారా? మారిన కొత్త కస్టమ్స్ రూల్స్ తెలిస్తే పండగే..

అమెరికా నుంచి ఐఫోన్, ల్యాప్‌టాప్ తెస్తున్నారా? మారిన కొత్త కస్టమ్స్ రూల్స్ తెలిస్తే పండగే..

అమెరికా నుంచి వస్తూ వస్తూ ఐఫోన్ కొని తెచ్చుకునే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. 2026 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త కస్టమ్స్ రూల్స్ ప్రకారం.. విదేశాల నుంచి స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావడం గతంలో కంటే చాలా చౌకగా మారింది. ముఖ్యంగా అమెరికా వెళ్లే ప్రయాణికులకు ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఐఫోన్ ధరలు భారత్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు పెరిగిన డ్యూటీ ఫ్రీ పరిమితి కారణంగా.. ఆపిల్ ఫోన్ లవర్స్ భారీగా పన్నులు చెల్లించకుండానే తమకు నచ్చిన ఫోన్‌ను ఇండియాకు తెచ్చుకోవచ్చు.

విదేశాల నుంచి విమానం లేదా షిప్ ద్వారా భారత్‌కు వచ్చే ప్రయాణికుల డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ను రూ.50వేల నుంచి రూ.75వేలకు పెంచారు. అంటే మీరు మీ వెంట తెచ్చుకునే వ్యక్తిగత వస్తువుల విలువ రూ.75వేల లోపు ఉంటే.. కస్టమ్స్ అధికారులకు ఒక్క రూపాయి కూడా టాక్స్ కట్టక్కర్లేదు. ఐఫోన్ కొనేవారికి ఇది పెద్ద ఊరటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికాలో ఐఫోన్ బేసిక్ మోడల్స్ చాలా వరకు ఈ ధరలోనే దొరుకుతాయి కాబట్టి సూపర్ సేవింగ్స్ పొందొచ్చు. ఒకవేళ మీ ఫోన్ లేదా ఇతర వస్తువుల విలువ రూ.75వేలు దాటితే, అదనపు మొత్తంపై కేవలం 10 శాతం కస్టమ్స్ డ్యూటీ.. దానిపై 10 శాతం సోషల్ వెల్ఫేర్ సర్ఛార్జ్ చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ఈ పన్ను 20 శాతంగా ఉండేది. అంటే ఇప్పుడు పన్ను భారం సగానికి సగం తగ్గిందన్నమాట. పైగా డ్యూటీఫ్రీ లిమిట్ కూడా పెరిగింది. 

మరో అద్భుతమైన మార్పు ల్యాప్‌టాప్‌ల విషయంలో జరిగింది. ఇప్పుడు 18 ఏళ్లు నిండిన ఏ ప్రయాణికుడైనా ఒక ల్యాప్‌టాప్ లేదా నోట్‌బుక్‌ను పూర్తిగా డ్యూటీఫ్రీగా తెచ్చుకోవచ్చు. విశేషమేమిటంటే.. ఈ ల్యాప్‌టాప్ విలువను పైన పేర్కొన్న రూ.75వేల పరిమితిలో లెక్కించరు. అంటే మీరు ఒక ల్యాప్‌టాప్‌తో పాటు, రూ.75వేలు విలువైన ఐఫోన్ లేదా ఇతర నచ్చిన వస్తువులు, ఎలక్ట్రానిక్స్ నిశ్చింతగా తీసుకురావచ్చు. అయితే ఫ్లాట్ స్క్రీన్ టీవీలు, బంగారు బిస్కెట్లు వంటి వస్తువులకు ఈ మినహాయింపులు వర్తించవని గుర్తుంచుకోవాలి.

ప్రయాణికులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. మీరు ఇతర దేశాల నుంచి వచ్చేటప్పుడు తెచ్చే వస్తువులు వ్యక్తిగత అవసరాల కోసం అయి ఉండాలి. ఒకే మోడల్‌కు చెందిన నాలుగైదు సీల్డ్ బాక్సులను వెంట తెచ్చుకుంటే కస్టమ్స్ అధికారులకు అనుమానం రావచ్చు. కాబట్టి షాపింగ్ చేసిన బిల్లులను దగ్గర ఉంచుకోవడం, అధికారులకు నిజాయితీగా వివరాలు వెల్లడించడం మంచిది. మొత్తానికి కొత్త కస్టమ్స్ రూల్స్ ఐఫోన్ ప్రియులకు విదేశీ షాపింగ్‌ను మరింత సరళతరం చేశాయని చెప్పుకోవచ్చు.