లూడో గేమ్ అనుకున్నా.. డెత్ గేమ్ అనుకోలేదు: ముగ్గురు పిల్లల తండ్రి

లూడో గేమ్ అనుకున్నా.. డెత్ గేమ్ అనుకోలేదు: ముగ్గురు పిల్లల తండ్రి

ముగ్గురు అక్కా చెల్లెలు.. 12, 14, 16  సంవత్సరాల వయస్సు.. అంతా మైనర్లే.. స్కూల్‎కు వెళ్తున్నారు. ఏం పని చేసిన ముగ్గురు కలిసే చేస్తారు.. తినడం, స్కూల్‎కు వెళ్లడం, ఇంట్లో ఒకే గదిలో నిద్రిస్తారు. వీరి బంధం చివరకు మరణంలోనూ వీడలేదు. ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో భవిష్యత్‎కు ముగింపు పలుకుతూ చిన్న వయస్సులోనే వీరు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆన్ లైన్ గేమ్. అవును.. ముగ్గురు అక్కాచెల్లెలు ఆన్‌లైన్ టాస్క్ ఆధారిత కొరియన్ గేమ్‎కు బానిసలయ్యారు.

 తిండి, నిద్ర, చదువు మానేసి అదే పనిగా గేమ్ ఆడుతుండటంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకున్నారు. మమ్మీ.. డాడీ క్షమించండి అని సూసైడ్ లెటర్ రాసి 9 అంతస్తుల భవనం పై నుంచి దూకి ముగ్గురు ఒకేసారి చనిపోయారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతులను నిషిక (16), ప్రాచి (14), పాఖి (12)గా గుర్తించారు పోలీసులు. ఘటన స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని దర్యా్ప్తు చేపట్టారు. 

ఆన్ లైన్ గేమ్‎కు బానిసలయ్యే ముగ్గురు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు.. ముగ్గురు కూతుర్లు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో బాలికల తండ్రి చేతన్ కుమార్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. నా ఇంటి మహారాణులు నన్ను వదిలి వెళ్లిపోయారంటూ గుండెలవిసేలా రోదించాడు. నా ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారని అనుకోలేదు.. వాళ్లు మొబైల్ ఫోన్‎లో లూడో గేమ్ ఆడుకుంటున్నారని అనుకున్నాను.. అది వాళ్లకు డెత్ గేమ్ అవుతుందని అనుకోలేదంటూ గుండెలు బాదుకున్నాడు. 

►ALSO READ | ఇండియా షాక్ : ముగ్గురు పిల్లలు.. 9వ అంతస్తు నుంచి దూకేశారు.. గేమింగ్ యాప్ టాస్క్ కారణమా..?

ఇది ఒక టాస్క్ గేమ్ అని.. ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదని కన్నీ్ళ్లు పెట్టుకున్నాడు. వాళ్లు మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుకునే వాళ్లు.. అది టాస్క్ గేమ్ అని.. డెత్ గేమ్ అని పోలీసులు చెప్పే వరకు నాకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. నా ముగ్గురు పిల్లలు 9వ అంతస్తు నుంచి దూకి చనిపోవటానికి.. నిచ్చెన వాడారంటూ కన్నీటితో చెప్పాడు ఆ తండ్రి. ఆన్ లైన్ గేమ్‎కు బానిసై ఒకే కుటుంబానికి  చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.