రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపై DCA ఆకస్మిక తనిఖీలు.. మీరు కొనే ఈ మందులతో జాగ్రత్త..!

రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపై DCA ఆకస్మిక తనిఖీలు.. మీరు కొనే ఈ మందులతో జాగ్రత్త..!

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆకస్మిక తనిఖీలు చేసింది. కోడైన్ కలిగిన దగ్గు సిరప్స్ అక్రమ విక్రయాలపై దృష్టి పెట్టింది. ఆల్ప్రాజోలామ్, ట్రామడాల్, జోల్పిడెమ్, నైట్రాజెపామ్ టాబ్లెట్లను ముఖ్యంగా తనిఖీ చేశారు. టైడాల్, టాపెంటడాల్ వంటి నొప్పి నివారణ మందులపై ఫోకస్ చేశారు. మెఫెంటెర్మిన్, అట్రాక్యూరియం బెసిలేట్ ఇంజెక్షన్ల విక్రయాలపై తనిఖీలు చేశారు. తనిఖీల్లో 63 మెడికల్ షాపుల్లో లోపాలను గుర్తించారు. లైసెన్సు సస్పెన్షన్,  రద్దుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

మెడికల్  షాపుల్లో కొన్న మందులు వికటించినా, సైడ్ ఎఫెక్ట్స్  వచ్చినా ఇకపై ప్రజలు సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం రాష్ట్రంలోని అన్ని మెడికల్  షాపుల్లో తప్పనిసరిగా క్యూఆర్ కోడ్, టోల్ ఫ్రీ నంబర్లను అందరికీ కనిపించేలా  ఏర్పాటు చేయాలని మెడికల్  షాపుల యజమానులను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఇప్పటికే ఆదేశించింది.

మెడికల్  షాపులో ఉండే పీవీపీఐ క్యూఆర్  కోడ్‌ను స్కాన్ చేయాలి లేదా అక్కడ బోర్డుపై ఉన్న 1800 1803024 టోల్ ఫ్రీ నంబర్‌‌ కు కాల్  చేసి మందు పేరు, వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్  వివరాలు తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల ఆ మందు నాణ్యతపై అధికారులకు సమాచారం అందుతుంది. తద్వారా భవిష్యత్తులో ఇతరులకు ఆ మందు వల్ల హాని కలగకుండా డీసీఏ చర్యలు తీసుకుంటుంది.