ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ మరోసారి పత్తి ధరలు తగ్గించింది. పత్తి నాణ్యత లేదని సీసీఐ క్వింటాల్కు యాభై రూపాయలు తగ్గించింది. క్వింటాల్ 8 వేల 50 రూపాయలతో కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించారు. తగ్గించిన ధరలను ఈ నెల 22న అమలు చేస్తామని తెలిపారు. పత్తి పింజా పొడవు తగ్గడం వల్ల ధరలు తగ్గించామని అధికారులు చెబుతున్నారు. ధరలు తగ్గించడంతో సీసీఐ అధికారులపై రైతులు మండిపడుతున్నారు.
సీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలు పత్తి రైతులను మరింత నష్టాలకు గురిచేస్తున్నాయి. సాగులో భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు తక్కువ రేట్లకే పత్తి అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని సీసీఐ విధానాన్ని సవరించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసి.. ఈసారి 5 క్వింటాళ్లు తగ్గించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా.. పత్తిలో తేమ 8 నుంచి 12 శాతం కంటే ఎక్కువ ఉంటే కొనమని సీసీఐ స్పష్టం చేయడం.. రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.
అలాగే, సీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన ‘కపాస్ కిసాన్ యాప్’ లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేశారు. కానీ, గ్రామీణ రైతుల్లో చాలామందికి స్మార్ట్ ఫోన్లు లేవు. అందువల్ల యాప్‌లో నమోదు చేయలేకపోతున్నారు. మరో వైపు కేంద్రం దిగుమతి సుంకాలు సడలించడంతో బహిరంగ మార్కెట్లో పత్తి ధర భారీగా పడిపోగా.. ఇప్పుడు సీసీఐ కొత్త నిబంధనలతో రైతులు పూర్తిగా చిక్కుముడిలో పడ్డారు.
