- బాలికపై లైంగికదాడి..ఇద్దరిపై కేసు నమోదు
- నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో దారుణం
ఉప్పునుంతల, వెలుగు : నాటక ప్రదర్శన చూసి రాత్రి ఇంటికి వస్తున్న 14 ఏండ్ల బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామంలో జరుగుతున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఆలయం ముందు శ్రీచెన్నకేశవస్వామి నాటక ప్రదర్శన వేశారు. ఈ ప్రదర్శన చూసేందుకు గ్రామానికి చెందిన ఓ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది.
అర్ధరాత్రి సమయంలో మంచినీళ్లు తాగేందుకని ఆలయం సమీపంలోనే ఉన్న ఇంటికి బయలుదేరింది. ఈ సమయంలో గ్రామానికి చెందిన దుడ్డు రమేశ్, నానిగౌడ్ అనే యువకులు బాలికను బలవంతంగా పక్కనే ఉన్న ఓ రేకుల షెడ్డులోకి ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాలిక తన కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులిద్దరిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపారు.
