ఆళ్లపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలోని సింగారం గ్రామంలో జ్వరంతో తొమ్మిదేళ్ల బాలుడు చనిపోయాడు. గ్రామానికి చెందిన గొత్తికోయ గుంపునకు చెందిన మాడ్ దేవ(9) ఇటీవల 5వ తరగతి పూర్తి చేశాడు. ఆ తరువాత బడికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. దేవ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆదివారం పరిస్థితి విషమించి చనిపోయాడు. గ్రామంలో మరికొంత మంది జ్వరాలతో బాధపడుతున్నారని, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
