ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మండలం అంకోలి గ్రామానికి చెందిన సుడగోణి సుధాకర్ గౌడ్ ను కరెంట్ షాక్ తో హత్య చేసేందుకు కుట్ర చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ ఎస్సై వీవీ విష్ణువర్ధన్తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు.
వ్యక్తిగత కక్షలతో సుధాకర్‌ను హత్య చేయాలని కుట్ర పన్నిన మడిగం స్వామి డబ్బు ఆశ చూపి బడే రమేశ్, పుల్లేడు గంగన్నను తన పథకంలో భాగస్వాములను చేశాడు. శుక్రవారం అర్ధరాత్రి బాధితుడి ఇంటి పైకప్పు ద్వారా కరెంట్ వైర్‌ను బెడ్ వరకు ఏర్పాటు చేసి ప్లగ్‌కు కనెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అయితే బాధితుడు బయటకు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు, విచారణ ద్వారా బడే రమేశ్, పుల్లేడు గంగన్నను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి కరెంట్ వైర్, నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు స్వామి పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.
